కర్ణాటక మంత్రి ఆడియో లీక్..సీఎం బొమ్మైకి కొత్త చిక్కులు!

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆయన పదవి ఊడిపోవడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో బీజేపీకి చెందిన యువనేత ఒకరు హత్యకు గురయ్యారు. దీంతో బసవరాజ్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంలో ఆయన తడబడుతున్నారని సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి. ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలు, కర్ణాటకకు చెందిన కొందరు ముఖ్యనేతలు సీఎం మార్పు వ్యవహారాన్ని ఖండిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మార్పు ఏమీ ఉండదని.. బొమ్మై పూర్తికాలం సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మధుస్వామి అనే మంత్రి మాట్లాడిన ఓ ఆడియో వైరల్ గా మారింది. అందులో ఆయన ఓ సామాజికకార్యకర్తతో మాట్లాడుతూ.. ‘ మేం ప్రభుత్వాన్ని నడపటం లేదు. కేవలం మేనేజ్ చేస్తున్నాం. మరికొన్ని రోజులు మేనేజ్ చేయాల్సిందే తప్పదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో మధస్వామిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. మధుస్వామి లాంటి వ్యక్తులు కేబినెట్ లో ఉండొద్దంటూ కొందరు సహచర మంత్రులు వ్యాఖ్యానించారు.

ఈ పరిణామం ముఖ్యమంత్రిని బొమ్మైని ఇరుకున పెట్టింది. ఈ వివాదంపై ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రి మధుస్వామి వేరే సందర్భంలో అలా మాట్లాడారు. ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ కర్ణాటక బీజేపీ వ్యవహారం రోజుకో ఘటనతో చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. బొమ్మైపై సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదువుతోంది. ఈ పరిణామాలపై బీజేపీ హైకమాండ్ ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags: cm bommai, karnataka bjp, madhuswamy audio leak