ఒకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌ల‌కు షాక్ ఇస్తోన్న జ‌గ‌న్‌… టిక్కెట్ ఇవ్వ‌న‌ని చెప్పేశారా..?

ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికలలో చాలా నియోజకవర్గాలలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకే జిల్లాలో ఈసారి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే ఛాన్సులు లేవని.. ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. తిరుపతి జిల్లాలోని మూడు రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.

సూళ్లూరుపేట – సత్యవేడు – గూడూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు అందిన నివేదికల ఆధారంగా వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కూడా జగన్ సంకేతాలు ఇస్తున్నారు. గూడూరు నుంచి కొత్త అభ్యర్థిగా ఆర్డీవో కిరణ్ నిలబెట్టనున్నారని తెలుస్తోంది. అందుకే కిరణ్ గూడూరులో ఓవైపు ఆర్డీవోగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు చాప కింద నీరుల రాజకీయం చేస్తున్నారు.

వైసీపీ పెద్దల నుంచి తనకు టిక్కెట్ పై వచ్చిన హామీతోనే కిరణ్ ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగ‌లపల్లి వరప్రసాద్ పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం వరప్రసాద్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక సూళ్లూరుపేటలో గత రెండు ఎన్నికల్లోను వరుస విజయాలు సాధిస్తున్న కిలివేటి సంజీవయ్య రాజకీయాలలోకి వచ్చినప్పుడు చాలా మంచి పేరుతో కొనసాగారు.

అయితే ఇప్పుడు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు.. మండల గ్రామస్థాయి నాయకులకు, ఆయనకు మధ్య తీవ్రమైన గ్యాప్‌ వచ్చేసింది. దీంతో అక్కడ మళ్ళీ వైసిపి విజయం సాధించాలి అంటే ఆయనను పక్కనపెట్టి కొత్త అభ్యర్థికి సీటు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన ఒక డాక్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైసిపి పెద్దల సూచనతోనే ఆ వైద్యుడు ఆ నియోజకవర్గంలో తరచు మెడికల్ క్యాంపులు పెడుతున్నట్టు టాక్ ?

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కూడా టికెట్ లేదని అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ టిడిపిలో వర్గ రాజకీయాలు ఉన్నాయి. అయినా కూడా ఆ పార్టీ తన అభ్యర్థిని ముందుగా ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్ ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఈమెపై నియోజకవర్గంలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అక్కడ ఆమెను ఓడించాలి అంటే ఆదిమూలంకు బదులుగా మరో అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. బహుశా తిరుపతి ఎంపీ ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ ఓకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద షాక్కులు ఇవ్వబోతున్నట్టు వైసిపి వాళ్ళే చెబుతున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp