గత సాధారణ ఎన్నికలలో వైసీపీ నుంచి ఏకంగా 22 మంది ఎంపీలు లోక్‌సభకు ఎంపికయ్యారు. మరో ఏడాదిలో మళ్లీ సాధారణ ఎన్నికలు రానున్నాయి. అయితే ఈసారి వైసిపి నుంచి సగం మంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. తాము ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగాలని జగన్ పై గట్టి ఒత్తిడి చేస్తున్నారు. వీరిలో కొందరికి జగన్ తిరిగి ఎంపీ టికెట్లు ఇస్తానని చెబుతున్నా వారు మాత్రం వినేలా లేరు.
కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి, అరకు ఎంపీ మాధవి పాడేరు అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంగా గీత అయితే తన ఎంపీ ల్యాడ్స్ నిధులు అన్నీ పిఠాపురంకే తరలించేస్తున్నారు. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్లాన్‌తోనే ఈ పని చేస్తున్నట్టు భోగట్టా..! రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయటం ఖరారు అయింది. ఇప్పటికే భరత్ కు జగన్ రాజమండ్రి సిటీ బాధ్యతలు అప్పగించేశారు.
అమలాపురం ఎంపీ చింతా అనురాధ రాజోలు నుంచి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నూజివీడు నుంచి, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ను ఉరవకొండ నుంచి పోటీ చేయించాలని జగన్ చూస్తుంటే.. రంగయ్య చూపు మాత్రం కల్యాణదుర్గం మీద ఉంది.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి అసెంబ్లీ పోటీ చేయాలని చూస్తున్నారు. ఇక నెల్లూరి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికే నెల్లూరు రూరల్ పగ్గాలు ఇచ్చారు. ఉప ఎన్నికల్లో గెలిచిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సత్యవేడు నుంచి అసెంబ్లీకి పంపాలన్నది జగన్ ఆలోచన. ఏది ఏమైనా ఈసారి వైసీపీ నుంచి ఎక్కువమంది ఎంపీల పేర్లు అసెంబ్లీ బరిలో ఉండడంతో వైసిపి తరఫున కొత్త ఎంపీ అభ్యర్థులను వెతుక్కోవలసిన అవసరం జగన్‌కు ఉంది.