గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు టిడిపి నేతల దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనకు ఎటు చూసినా దబిడి దిబిడి మోత మోగిపోతుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సదరు వైసీపీ ఎమ్మెల్యే.. ఈసారి ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఏటికి ఎదురీదుతున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో మాజీ మంత్రి కూడా ఎటాక్ చేయడంతో చివరకు కౌంటర్లు కూడా ఇచ్చుకోలేని పరిస్థితికి వచ్చేశారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.
పెదకూరపాడు నియోజకవర్గం అంటేనే గత 15 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు అడ్డాగా ఉంది. పార్టీ ఓడిపోయిన 2009 ఎన్నికలలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన కొమ్మాలపాటి 2014 ఎన్నికలలో మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికలలో వైసిపి ప్రభంజనంలో ఆయన ఓటమిపాలయ్యారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి శ్రీధర్ నిత్యం నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉంటున్నారు. గత ఏడాదిన్నర కాలంగా నియోజకవర్గంలో ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకంటే ఎక్కువగా శ్రీధర్ ప్రజల కోసం పనిచేస్తూ వచ్చారు. గత ఏడాదిన్నర కాలంలో శ్రీధర్ నియోజకవర్గంలో తిరగని ఊరు లేదు.. రాష్ట్రస్థాయిలోనే ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీధర్ దూకుడుతో ఎమ్మెల్యే శంకరరావు ఎప్పుడో బేజారు అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ టిడిపికి మరో అంశం కూడా కలిసి వచ్చింది. గతంలో ఇక్కడ నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా టిడిపిలోకి వచ్చారు.
కన్నా నియోజకవర్గాన్ని వదిలేసి 15 సంవత్సరాలు అవుతున్నా… ఆయనకు ఎంతో కొంత అనుచరులు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఈ వర్గం కూడా టిడిపికి ప్లస్ అవుతోంది. ఈ ఈక్వేషన్ దెబ్బతో ఎమ్మెల్యే శంకరరావుకు మైండ్ బ్లాక్ అవుతోంది. ఓవైపు నియోజకవర్గానికి ఈ నాలుగేళ్లలో ఎమ్మెల్యేగా ఏం చేశావు? దమ్ముంటే చర్చకు రా అని శ్రీధర్ విసురుతున్న సవాళ్లు… అసలు పెదకూరపాడు నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో నంబూరు శంకరరావుకు తెలుసా ? అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విసిరే సవాళ్లతో శంకర్రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
శంకరరావుకు దోచుకోవటం దాచుకోవడమే తప్ప మరొకటి తెలియదని కన్నా ఫైర్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి సవాళ్ల పర్వంలోకి కన్నా కూడా ఎంటర్ అవ్వడంతో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. అసలు శంకరరావు సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదన్న చర్చలే నియోజకవర్గంలో ఎటు చూసినా వినిపిస్తున్నాయి.