ప్రముఖ సీనియర్ తెలుగు నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు నేడు అనగా ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో కన్ను మూసిన సంగతి తెలిసినదే. కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమ జీర్ణించుకోలేకపోతుంది. రాజకీయ, సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
“శ్రీ కృష్ణంరాజుగారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజుగారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైంది. ఆయన ‘రెబల్ స్టార్’కి నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగానూ కూడా ఎన్నో సేవలను అందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా తమ్ముడులాంటి ప్రభాస్‌కి, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు చిరంజీవి.
ఇక ఇండస్ట్రీలో రెబెల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ‘ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు’. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1966లో చిలకా గోరింకా చిత్రంతో హీరోగా తెలుుగ చిత్రసీమలోకి అడుగు పెట్టారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాన్ ఇండియా హీరోగా రాణిస్తోన్న ప్రభాస్‌కు కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారనే విషయం అందరికీ తెలిసినదే.