టీడీపీ నుంచి 2024లో అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తోన్న న‌లుగురు యంగ్‌స్ట‌ర్స్ వీళ్లే…!

టిడిపి అధినేత చంద్రబాబు వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో నియోజకవర్గంలో వరుసగా అభ్యర్థుల‌ను ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గత 20 రోజుల వ్యవధిలో కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల పేర్లను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జ‌ల‌ సుధీర్ రెడ్డి – కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ – పులివెందులలో బీటెక్ రవి – పూత‌ల‌ప‌ట్టులో హెచ్ఎంటీవీ జ‌ర్న‌లిస్టు ముర‌ళీ మోహ‌న్ – గోపాల‌పురంలో మ‌ద్దిపాటి వెంక‌ట్రాజు – రాజాన‌గ‌రంలో బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ చౌద‌రి వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పార్టీ అభ్య‌ర్థులుగా బ‌రిలో ఉంటార‌ని ప్ర‌క‌టించారు.

అలాగే పార్వ‌తిపురంలో బోనెల విజ‌య్‌చంద‌ర్‌ను అక్క‌డ అభ్య‌ర్థిగా డిక్లేర్ చేశారు. ఇదిలా ఉంటే చంద్ర‌బాబు పైన ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల్లో న‌లుగురు తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తోన్న వారే కావ‌డం విశేషం. పూత‌ల‌ప‌ట్టు, గోపాల‌పురం, పార్వ‌తీపురం, రాజాన‌గ‌రం అభ్య‌ర్థులు తొలిసారి అసెంబ్లీ బ‌రిలో ఉన్న‌వారే. ఒక్క బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ మాత్రం గ‌తంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ఈ న‌లుగురు కొత్త అభ్య‌ర్థులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా గెలిచి అసెంబ్లీ బ‌రిలో అడుగు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్కో అభ్య‌ర్థి బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఇలా ఉంది.

గోపాల‌పురం – మ‌ద్దిపాటి వెంక‌ట్రాజు :
గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు పార్టీ ఆఫీసులో ఎన్నో కార్య‌క్ర‌మాల ద్వారా చంద్ర‌బాబు, లోకేష్ బాబును మెప్పించిన వెంక‌ట్రాజు పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగాను, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రోగ్రామ్ క‌మిటీ ఇన్‌చార్జ్‌గాను ప‌ని చేసి మ‌న్న‌న‌లు పొందారు. చిన్న వ‌య‌స్సులోనే పార్టీకి గుండెకాయ లాంటి ప్రోగ్రామ్ క‌మిటీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇవ్వ‌డం అంటే వెంక‌ట్రాజులోని స‌మ‌ర్థ‌త‌, స‌త్తా బాబును విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అందుకే ఇలాంటి యువ‌కుడు పార్టీ త‌ర‌పున‌ అసెంబ్లీలో ఉండాల‌ని గోపాల‌పురం అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేశారు.

పార్వ‌తీపురం – విజ‌య‌చంద‌ర్ :
ఇక పార్వ‌తీపురం నుంచి 2014లో గెలిచిన బొబ్బిలి చిరంజీవులు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆయ‌న మృదుస్వ‌భావి. మంచి వ్య‌క్తి. ఈ సారి అక్క‌డ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆయ‌న భ‌విష్య‌త్తును తాను చూసుకుంటాన‌ని హామీ ఇస్తూ కొత్త అభ్య‌ర్థిగా విజ‌య్ చంద‌ర్ పేరు ఖ‌రారు చేస్తూ ఆయ‌న్ను గెలిపించాల‌ని అక్క‌డ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

గోపాలపురం, పార్వ‌తీపురం సేమ్ టు సేమ్ :
గోపాల‌పురంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు ప్లేసులో వెంక‌ట్రాజుకు అభ్య‌ర్థిత్వం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఆయ‌న్ను ఏం చేయాలో .. ఎలా న్యాయం చేయాలో తాను చూసుకుంటాన‌ని వెంక‌ట్రాజును భారీ మెజార్టీతో గెలిపించాల‌ని దొండ‌పూడి మీటింగ్‌లో అక్క‌డ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగంగా సూచించారు. దేవ‌ర‌ప‌ల్లిలో మీటింగ్‌లోనూ మ‌రోసారి ఆయ‌న పేరే ఖ‌రారు చేశారు. అలాగే పార్వ‌తీపురంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల‌ను ఉద్దేశించి ఆయ‌న చాలా మంచివాడు… ఆయ‌న‌కు తాను న్యాయం చేస్తాను… విజ‌య్ చంద‌ర్‌ను గెలిపించి అసెంబ్లీకి పంపాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌లకు అక్క‌డ ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున హ‌ర్షాతిరేకాల‌తో ఆమోదం ల‌భించింది.

పూత‌ల‌ప‌ట్టు – ముర‌ళీ మోహ‌న్ :
చిత్తూరు జిల్లాలోని పూత‌ల‌ప‌ట్టు ఒక‌ప్పుడు పార్టీకి కంచుకోట‌. గ‌త ప‌దేళ్ల‌లో ఇక్క‌డ పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే హెచ్ఎంటీవీ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసిన ముర‌ళీ వివాద ర‌హితుడు, సౌమ్యుడు కావ‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేయ‌డంతో పాటు ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో నియెజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌లో 10 రూపాయ‌లు ఇచ్చి మ‌రీ గెలిపించాల‌ని చెప్పారు.

రాజాన‌గ‌రం – బొడ్డు వెంక‌ట ర‌మ‌ణ చౌద‌రి :
ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజాన‌గ‌రం నుంచి 2009, 2014ఎన్నిక‌ల్లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంక‌టేష్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ సారి ఆయ‌నే అక్క‌డ నుంచి స్వ‌చ్ఛందంగా త‌ప్పుకోవ‌డంతో చంద్ర‌బాబు మాజీ విప్‌, దివంగ‌త పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్క‌ర రామారావు త‌న‌యుడు బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ చౌద‌రిని రాజాన‌గ‌రం ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌డంతో పాటు ఆయ‌నే ఇక్క‌డ 25 ఏళ్లు రాజ‌కీయం చేస్తారంటూ అభ్య‌ర్థిత్వం ప్ర‌క‌టించేశారు.

ఇలా ఈ సారి ఈ న‌లుగురు క్యాండెట్లు ప‌క్కాగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌డం అయితే ఖాయ‌మ‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక‌ర‌ణ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ యంగ్‌స్ట‌ర్స్ రేప‌టి రోజున అసెంబ్లీలో త‌మ గ‌ళం వినిపించ‌డంతో పాటు పార్టీకి భ‌విష్య‌త్ మెరుపులు కానున్నారు.