నిన్నామొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలకు దూరంగా మెదిలిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందా? కొత్త పొత్తుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసిందా? తమతో కలిసి రావాలని ప్రాంతీయ పార్టీలను ఆహ్వానిస్తున్నదా? అందులో భాగంగానే ఏపీ సీఎం జగన్‌తో భేటి అయ్యిందా? త‌్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ సమావేశం కానుందా? చేపట్టనున్న సెంట్రల్ కెబినెట్‌లో బెర్తులను కేటాయించనుందా? గత కొద్ది రోజులుగా రాజకీయా వర్గాల్లో ఇదే చర్చ కొనసాగుతున్నది. ఇప్పటికే ఏపీలో వైసీపీ, బీజేపీ పొత్తుపై ఊహగాన కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు కూడా కొందరు పొత్తు ఉంటుందనే సంకేతాలనిచ్చారు. మరికొందరు కాదని ఖండించారు. ఆ విషయం పక్కన పెడితే ఇంతకీ బీజేపీలో ఈ మార్పు ఎందుకు? అన్నదే అసలు సమస్యగా మిగిలిపోయింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమీపంలో ఎలక్షన్లు కూడా లేవు కదా? ఇప్పుడు పొత్తుల అవసరమేంటని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు అసలు బోధ పడక. మరీ నిజమే ఎందుకు కాషాయ దళం కొత్త ఎత్తులను వేస్తున్నది. అందులో వ్యూహమేంటి?
ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ చాప కింది నీరులా దేశంలోని ప్రాంతీయ పార్టీల వరకూ విస్తరించారు. బీజేపీ పుణ్యమాని వెలుగులోకి వచ్చిన ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు మద్దుగా వ్యూహాలు రచించి విజయం సాధించారు. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లోనూ ఏఏపీ గెలుపుతో తన సత్తా చాటారు. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీతోనూ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడవే బీజేపీకి సమస్యగా మారాయి. పీకే ఏకంగా ప్రాంతీయ పార్టీలన్నింటీని కూటమిగా చేర్చి జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్‌ను తెరమీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతున్నది. మరోవైపు ఆయనే సొంతంగా పార్టీని పెడతారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల 18వ తేదీన అందుకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని ఆయన స్వయంగా ప్రకటించారు. దీనినంతటిని కనిపెట్టే బీజేపీ తన భాగస్వామ్య పార్టీ జేడీయూ అధినేత నితీష్‌కుమార్ తో ఆయనను సస్పెండ్ చేయిందని సమాచారం.
ఈ నేపథ్యంలోనే బీజేపీకి భయం పట్టుకుందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. పీకే శక్తి సామర్థ్యాలపై పూర్తిగా అవగాహన ఉన్న కమలం నేతలకు ఇది మింగుపడని విషయంగా మారింది. ఒకవేళ ప్రాంతీయ పార్టీలన్నీ, అందులోనూ దక్షిణాదిన బలంగా ఉన్న పార్టీలన్నీ పీకే పంచన చేరితే మున్ముందు రాజకీయంగా తీరని నష్టం వాటిల్లుతుందని అది భావిస్తున్నదని తెలుస్తున్నది. ప్రశాంత్ కిషోర్‌కు చెక్ పెట్టేందుకు ముందుగానే బీజేపీయే ఆయా పార్టీలను కేబినెట్‌లోకి ఆహ్వానిస్తున్నదని సమాచారం. అందులో భాగంగానే కొత్త పొత్తులను తెరమీదకు తీసుకొచ్చిందని పలువురు నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పీకేను రాజకీయంగా ఒంటరిని చేయాలన్న వ్యూహంలో భాగంగానే కాషాయ దళం ఈ ఎత్తుగడ వేసిందని వాదనలు వినిపిస్తున్నాయి.
అదీగాక ప్రస్తుతం సీఏఏ, ఎన్‌పీఆర్ తదితర బిల్లులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. దానిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ర్ట అసెంబ్లీలు ఆ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మాణాలను చేశాయి. త్వరంలోనే ఏపీ, తెలంగాణలు కూడా చేయాలని భావిస్తున్నట్లు వినవస్తున్నది. మరో విషయమేమంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. చట్టాలను తీసుకొచ్చింది. 370 యాక్ట్ రద్దు, తలాక్ రద్దు, అయోధ్య వివాదం అందులో ఒకటి. మున్ముందు సీఆర్‌పీసీ చట్టాలను, న్యాయ చట్టాలను కూడా మార్చాలని భావిస్తున్నది. ఇటీవలే ప్రధాని మోడీ సైతం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక చట్టాలను తేవడంలో డబుల్ సెంచరీ కొడతాం అని క్రికెట్ పరిబాషలో వివరించి పరోక్షంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో అయా పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ కొత్తగా ఈ పొత్తుల రాగం ఆలపిస్తున్నదని తెలుస్తున్నది. మరి ఆ పొత్తులు చిగురిస్తాయో? వాడిపోతాయో చూడాలి. అంతా 18వ తేదీన పీకే ప్రకటన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.