ఏపీ సీఎం జ‌గ‌న్ బాట‌లో క‌ర్ణాట‌క స‌ర్కార్‌..

ఏపీలో అధికారంలోకి వ‌చ్చ‌న త‌రువాత జగన్ సర్కార్ రాజ‌ధాని అంశంలో ముఖ్య‌నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తిని కాద‌ని, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని, అందులో భాగంగా కొత్త‌గా మూడు రాజధానులను ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించింది. అందులో భాగంగా విశాఖలో ప‌రిపాల‌న‌, కర్నూలులో న్యాయ‌పాల‌న‌, అమరావతిలో శాస‌న రాజ‌ధానిగా చేయాల‌ని నిర్ణ‌యించింది. ఆ దిశ‌గా ఇప్ప‌టికే చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందుకు సంబంధించిన బిల్ల‌ను అసెంబ్లీలో ఏక‌గ్రీవంగా ఆమోదించింది. శాస‌న‌మండ‌లిలో ఊహించ‌ని రీతిలో చుక్కెదురువ‌డంతో ఏకంగా లేజిస్లేటీవ్ కౌన్సిల్‌నే ర‌ద్దు చేస్తూ తీర్మాణం చేసి, ఆ బిల్లును పార్ల‌మెంట్‌కు పంపింది. మ‌రోవైపు క‌ర్నూలుకు కీల‌క విజిలెన్స్ త‌దిత‌ర ప‌లు శాఖ‌ల‌ను త‌ర‌లించాల‌ని తెల‌పుతూ జీవో 13ను సైతం జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు బాట‌లో క‌ర్నాట‌క య‌డ్యూర‌ప్ప స‌ర్కారు కూడా ప‌య‌నిస్తున్న‌ది. ప‌లు శాఖ‌ల‌ను ప్ర‌జ‌ల సౌల‌భ్యం కోసం బెంగుళూరు నుంచి త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బీజేపీ అధిష్ఠానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో క‌ర్నాట‌క స‌ర్కారు ఆ దిశ‌గా చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేస్తున్న‌ది. ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను దృష్ట్యా.. కొన్ని కార్యాలయాలను వారికి దగ్గరగా తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు ప్ర‌క‌టించింది. అందులో భాగంగా మొత్తంగా తొమ్మిది ముఖ్యమైన కార్యాలయాలను బెంగళూరు నుంచి బెళ‌గావికి తరలించాలని స‌న్నాహాల‌ను చేస్తున్న‌ట్లు తెలిపింది. అందులో ఇరిగేషన్ శాఖకు సంబంధించి కృష్ణ భాగ్య జలనిగం, కర్ణాటక నీరావరి నిగమ్, పవర్ లూమ్ కార్పొరేషన్, షుగర్ డైరెక్టరేట్, చెరుకు డెవలప్‌మెంట్ కమిషనర్, కర్ణాటక హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉప లోకాయుక్త కార్యాల‌యాల‌ను తరలించాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

అయితే దీనిపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇది కొత్త చ‌ర్చ‌కు తెర‌దీసింది. మ‌రోవైపు కర్ణాటకలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపున‌కు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే, జ‌గ‌న్ నిర్ణ‌యానికి కూడా ఆమోద ప‌డిన‌ట్లేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఒక‌వేళ ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తే గ‌నుక రాజ‌కీయంగా బీజేపీ ఇర‌కాటంలో ప‌డాల్సి వ‌స్తుంద‌ని వివ‌రిస్తున్నారు. క‌ర్నాట‌క‌లో ఒకే చెప్పి ఇక్క‌డ వ్య‌తిరేకిస్తే విమ‌ర్శ‌లు త‌ప్ప‌వ‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌ర్నాట‌క నిర్ణ‌యం మ‌రోవైపు వైసీపీ నేత‌ల్లో జోష్ పెంచుతున్న‌ది. త‌మ వాద‌న‌కు బ‌లం చేకూర‌నుంద‌ని సంబురాల్లో మునిగితేలుతున్నారు నాయ‌కుడు. మ‌రి ఏపీపై కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో. చూడాలి మ‌రి.

Tags: amaravathi capital, ap cm jagan, bjp leaders, karanataka cm yaduarappa