ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో నాలుగైదు రోజుల్లో తన క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు వైసిపి వర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులలో ఇద్దరు, ముగ్గురు మంత్రులను పక్కన పెట్టేసి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలామంది ఎమ్మెల్సీలు వైసిపి నుంచి ఎన్నికయ్యారు.
ఎమ్మెల్సీలలో కూడా ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక కీలక మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్న మంత్రిగారికి ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి అర్జెంటుగా కలవాలని ఫోన్ రావడంతో ఆయన హుటాహుటిన తాడేపల్లి బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ మంత్రి ఎవరో కాదు పలాస ఎమ్మెల్యే, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. అప్పలరాజు గత ఎన్నికలలోనే తొలిసారిగా పలాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే మత్స్యకార సామాజిక వర్గం నుంచి అప్పటివరకు జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి భర్తీ చేసే క్రమంలో జగన్ అప్పలరాజుకు అనుహ్యంగా మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రిగా అప్పలరాజు దూకుడుగా ముందుకు వెళ్లడంతో పాటు ఒక్కోసారి వివాదాలకు కూడా కారణమయ్యారన్న చర్చలు ఉన్నాయి. 2020లో ఆయనకు మంత్రి పదవి రాగా.. ఇప్పటికే మూడేళ్ల పదవీకాలం కూడా పూర్తి అయింది.
మధ్యలో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన మంత్రి పదవికి ముప్పు రాలేదు. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఫోన్ కాల్ రావడంతో అప్పలరాజు అనుచరులలో బిపి హై రేజ్ అయిందని పలాస వైసీపీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరిలో అప్పలరాజును పక్కన పెట్టేస్తారని.. ఆయన పనితీరు పట్ల జగన్ అంత సంతృప్తిగా లేరని వార్తలు వస్తున్నాయి. అసలు పలాస టిక్కెట్ విషయంలో కూడా ఈ సారి సర్వేల ఆధారంగా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతారని కూడా ప్రచారం జరుగుతుంది.
కొద్దిరోజుల క్రితం అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ సామాజిక సమీకరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కొరితే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా తను సిద్ధమని ప్రకటించారు. ఏదేమైనా అప్పలరాజుకు తాను మాజీ మంత్రిని అవుతానని ముందే సంకేతాలు రావడంతో ఆయన ఆ మాటలు అన్నట్టు తెలుస్తోంది. మరి మంత్రిగా శ్రీకాకుళం నుంచి బయలుదేరిన అప్పలరాజు రాజకీయ భవిష్యత్తు ఎలా ? ఉండబోతుంది అన్నది కొద్ది గంటల్లోనే క్లారిటీ వచ్చేయనుంది.