రాఘవేంద్రరావుని ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేశాడంటే!

ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరును డాక్ట‌ర్ వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడాన్ని చాలా మంది తప్పుబట్టారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణలతో పాటు తదితర సినీ ప్రముఖులు సైతం పేరు మార్చడం మంచి పద్ధతి కాదంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఈ పేరు మార్పుపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా పేరు మార్చడానికి ఖండించారు. కాగా ఈ ట్వీట్‌కి స్పందిస్తూ నెటిజన్లు అతనితో ఒక ఆట ఆడుకుంటున్నారు.

రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా.. “ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీ నుంచి తొలగించినందుకు తెలుగుతల్లి కన్నీరు మున్నీరవుతున్నద”ని పేర్కొన్నారు. దాంతో అతని పొలిటికల్ చరిత్ర మొత్తం ఒకసారి గుర్తు చేస్తూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. రాజకీయాలు, వివాదాలన్నీ పక్కనపెట్టి ప్రశాంతంగా జీవించడానికే ఇష్టపడతానని ఈ దర్శకుడు కొన్నాళ్ల క్రితం చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాలపై మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకున్నారు. టీడీపీ హయాంలో రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా వర్క్ చేశారు. చంద్రబాబుకి సానుభూతి పరుడుగా ఉన్నారు. దాంతో ఎన్టీఆర్‌ వైపు రాఘవేంద్ర రావు లేడని అందరూ అర్థం చేసుకున్నారు.

అందుకే ఇప్పుడు నెటిజన్లు అతన్ని తిడుతున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకుంటే ఎక్కడ నిలబడ్డారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “తెలుగు తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుందని అన్నారు కదా. అది పక్కన పెట్టండి. ఎన్టీఆర్ కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎన్టీఆర్‌తో ఉన్నారా లేదా చంద్రబాబుతో ఉన్నారా?” అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. “పేరు మార్పు విషయమై నందమూరి, నారా కుటుంబాలు కూడా ఏడవడం లేదు… అలాంటప్పుడు మా తెలుగు తల్లీ ఎందుకు ఏడుస్తుంది, సార్??.. ఓట్లు దండుకోవడానికి అధికారంలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబు ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారు.. ఇది తెలిసిన సంగతే కదా” అని మరో నెటిజన్ అన్నారు.

ఇంకొందరు తెలుగు తల్లి ఎందుకు ఏడుస్తుంది అని లాజికల్‌గా ప్రశ్నలు వేస్తూ రాఘవేంద్రరావుకి చెమటలు పట్టించారు. ‘‘వైఎస్‌ఆర్‌ తెలుగుతల్లి కొడుకు కాదా? కొడుకు పేరు మరోటి పెడితే ఆమె ఎందుకు ఏడుస్తుంది? తెలుగుతల్లికి అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులందరినీ విస్మరించి, ప్రతి వీధికి ఎన్టీఆర్, అతని విగ్రహాలతో పేరు పెడితే ఆమె ఏడవలేదా?” అని ఒక నెటిజన్ సూటిగా ప్రశ్నించారు. ‘రాజకీయ వ్యాఖ్యలు చేయడం హీరోయిన్ల నాభి అందాన్ని చూపించినంత సులువు కాదని రాఘవేంద్రరావుకి ఇప్పటికే బోధపడి ఉండొచ్చని’ మరికొందరు అతనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Tags: doctor YSR, movie news, name change, NTR University, Raghavendra Rao, Tollywood director