ప్రాంతీయ పార్టీల చూపు.. ప్ర‌శాంత్ కిషోర్ వైపు

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న వ్యూహం ర‌చిస్తున్నారంటే ప్ర‌త్య‌ర్థ పార్టీలు వ‌ణికిపోవాల్సిందే. ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకోవాల్సిందే. ఎన్నిక‌ల బ‌రిలో దిగారంటే మ‌హ‌మ‌హులు సైతం మ‌ట్టిక‌ర‌వాల్సిందే. అందుకే ఆయ‌న‌కు రాజ‌కీయాల్లో పాపులారిటీ తెగ పెరిగిపోయింది. ఏకంగా దిగ్గ‌జ మ్యాగ‌జైన్ ఫోర్బ్స సైతం గ‌తంలో ఆయ‌న ఘ‌న‌త‌ను చాటింది. ఈ ద‌శాబ్ద‌పు రాజ‌కీయాల్లో అత్యంత ప్ర‌భావ‌శీల వ్య‌క్తిగా పీకేను అభివ‌ర్ణించింది. ఆయ‌న ప్ర‌తిభ‌కు, రాజ‌కీయ చ‌తుర‌త‌ను ఉద‌హ‌ర‌ణ‌లు అనేక‌మున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్రాంతీయ పార్టీలు త‌మ రాష్ర్టాల్లో అధికారాన్ని చేజిక్కుచుకునేందుకు ఆయ‌న నేతృత్వంలోని ఐప్యాక్ సంస్థ వైపు ఆశ‌గా ఎదురుచూస్తున్నాయి. ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఎగ‌బ‌డుతున్నాయి.

ప్ర‌శాంత్ కిషోర్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన‌లేదు. కేవ‌లం ప‌రోక్ష రాజ‌కీయాల్లోనే ఉన్నారు. 2014లో మోడీ, అమిత్‌షా ద్వ‌యం గెలుపున‌కు వ్యూహాల‌ను ర‌చించడంతో ఆయ‌న పేరు ఒక్క‌సారిగా తెర‌మీద‌కు వ‌చ్చింది. అటు త‌రువాత ఆయ‌న త‌న సొంత రాష్ర్టం బీహార్ రాజ‌కీయాల్లో, అక్క‌డి జేడీయూలో చేరారు. అయిన‌ప్ప‌టికీ ఇత‌ర రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహాల‌ను ర‌చిస్తూ వ‌చ్చారు. అందులో భాగంగా మొన్న‌టి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ కోసం ప‌నిచేశారు. ఆ పార్టీ తిరుగులేని మెజార్టీని సాధించ‌డంలో కీల‌క భూమిక‌ను పోషించారు. దీంతో ఆయ‌న మ‌రోమారు పీకే పేరు మార్మోగిపోయింది. ఇక ఆ త‌రువాత ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి సేవ‌ల‌ను అందించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ సాధించిన ఘ‌న విజ‌యం అందిర‌కీ తెలిసిందే. ఆ దీంతో మిగ‌తా పార్టీలు సైతం ఇప్పుడు ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌ల కోసం వెంప‌ర్లాడుతున్నాయి. ఒక‌దాని వెన‌క ఒక‌టి ఆయ‌న ఐప్యాక్ సంస్థ వైపు ఆశ‌గా అడుగులు వేస్తున్నాయి.

పీకేను ఆశ్ర‌యించేవారిలో చిన్నాచిత‌క పార్టీల నేత‌లు ఉన్నారంటే ఏమో కావ‌చ్చు. కానీ మ‌హామ‌హా నేత‌లు, త‌ల‌లు పండిన రాజ‌కీయ ఉద్దండులు సైతం ఆయ‌న త‌లుపుతుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న ఎంత‌టి ప్ర‌భాశీలో అర్థ‌మ‌వుతుంది. వారిలో ముఖ్య‌మంగా ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఒక‌రు. ఒంటిచేత్తో లాల్‌ఘ‌డ్‌ను బ‌ద్ద‌లు కొట్టిన ఈ దీదీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ జోరుకు క‌ళ్లెం వేయ‌లేక‌పోయింది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే త‌న సీటుకు కూడా ఎస‌రు వ‌చ్చే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ముందే ఊహించింది. అంతే పీకే వైపు ఒక చూపు సారించింది. అది ఏమీ మ‌హ‌త్య‌మో.. ప్ర‌శాంత్ వ్యూహ ఫ‌లిత‌మో కానీ కొద్దినెల‌ల కాలంలోనే ఆ పార్టీ తిరిగి పుంజుకున్న‌ది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చేజార్జుకున్న ఏడు కార్పొరేష‌న్ల‌ను తిరిగి కైవ‌సం చేసుకోవ‌డం విశేషం.

ఇలా వ‌రుస‌గా అడుగుపెట్టిన చోట‌ల్లా విజ‌యాల‌ను సాధించ‌డ‌మేగాక‌, త‌న‌ను న‌మ్మివ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కిస్తూ వారి విశ్వాసాన్ని పొందుతున్నాడు పీకే. అందుకే రాజ‌కీయాల్లో ఆయ‌న ప‌లుకుబ‌డి అమాంతం పెరిగిపోయింది. ఇటీవ‌లే త‌మిళ‌నాడు డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ సైతం పీకేతో దోస్తీ క‌ట్టారు. త‌న పార్టీ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను ఎన్నిక‌ల మాంత్రికుడి భుజ‌స్కందాల‌పై పెట్టాడు. ఇప్పుడు తాజాగా అదే బాట‌లో మ‌రో ప్రాంతీయ పార్టీ కూడా చేరింది. క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేసి భంగ‌ప‌డ్డ జేడీఎస్‌. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ పార్టీ నాయకుడయిన‌ కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పీకే సేవలను వినియోగించుకుంటున్నామని ప్ర‌క‌టించడం విశేషం. ఇదే విష‌య‌మై ఇటీవ‌లే వారిద్ద‌రూ భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మీడియాకు వివ‌రించారు. అంతేకాదు సొంత రాష్ర్టం బీహార్‌లో కూడా లాలు పార్టీ ఆర్జేడీకి సేవ‌లు అందించే దిశ‌గా చ‌ర్చ‌లు సాగుతుండ‌డం విశేషం. ఇప్ప‌టికే ద‌క్షిణాదిలో తెలంగాణ, కేర‌ళ మిన‌హా మిగ‌తా అన్ని రాష్ర్టాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీలో పీకే సేవ‌లు అందించిన‌ట్ల‌యింది. ఇప్పుడిది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంకా పీకే బాట మ‌రెన్ని పార్టీలు అడుగులు వేస్తాయోన‌నే ఆస‌క్తిని రేపుతున్న‌ది.

Tags: cm jagan, dmk, i pack agency, kejriwal, kumaraswamy, prshanth kishor