పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం విప్‌ జారీ

సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి తదితర అంశాలపై చర్చ కొనసాగే అవకాశముంది. అందుకు అనుగుణంగా అధికార ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అస్త్రశస్త్రలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ బిల్లును సోమవారమే ప్రవేశపెట్టాలని భావిస్తున్నదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సమాలోచనలు సైతం జరిపారు. అసెంబ్లీలో ఆ బిల్లును ఎలా? ఎప్పుడు ప్రవేశపెట్టాలి అనే అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా సోమవారం ఉదయమే మంత్రి మండలి సమావేశం కానుంది. పలు అంశాలపైన, వికేంద్రీకరణ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపే అవకామున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ కానుంది. అనంతరం 11 గంటలకు సభ ప్రారంభంకానుంది.

ఇదిలా ఉండగా పభ్రుత్వం తీసుకురానున్న వికేంద్రీకరణ బిల్లు నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ తమ ఎమ్మెల్యేలకు విప్‌ను జారీ చేసింది. యథావిధిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై, టీడీపీ నిర్దేనం ప్రకారం నడుచుకోవాలని, ఓటువేయాలని ఎమ్మెల్యేలను పార్టీ విప్‌ డీబీవీ స్వామి కోరారు. పార్టీకి విరుద్ధంగా వ్యవహరించినా, ఓటు వేసిన క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇటీవలే టీడీపీని వీడి పార్టీ మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, సుద్దాళి గిరిలకు సైతం పోస్టుల ద్వారా విప్‌ను జారీ చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా తేదేపా శాసనసభా పక్ష సమావేశాన్ని పార్టీ కేంద్రకార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన నేడు కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశనం చేయనున్నారు.

Tags: assembly meetings, cm jagan, de centralization bill, tdp