పవన్… అమిత్ షాని ఇందుకే కావాలన్నారా..!

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఖుషీ సినిమాలో ఆడవారికి మాటలకు అర్ధాలే వేరులే అనే సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ లో ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరు అని ఉందిగానీ…ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ మాటలకు అర్ధాలే వేరులే అన్నట్లు ఉంది. ఆయన అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో ? ఎప్పుడు ఎవరిని పొగుడుతారో ? ఎవరి తిడుతారో కూడా అర్ధం కాదు. ఏం అర్ధం కాకపోయిన నోటికి వచ్చింది మాత్రం మాట్లాడేస్తూ ఉంటారు. అందులో సాధ్య అసాధ్యాలు అనేవి ఆలోచించకుండా నేలవిడిచి సాము చేస్తారు. ఏదో వీరావేశంతో మాట్లాడేస్తుంటారు.

ఇక ఇటీవల కాలంలో జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్న పవన్ తనకు బీజేపీ క్లోజ్ అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే బీజేపీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో జగన్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు కనబడుతోంది. అందుకు తాజాగా ఆయన మాట్లాడిన మాటలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రెసిడెంట్, హోమ్ మంత్రి అమిత్ షాపై పొగడ్తలు కురిపించిన పవన్… దేశానికి అమిత్ షా లాంటి వ్యక్తులే కావాలని మాట్లాడారు. ఆయన ఏదైనా ఉక్కుపాదంతో అణిచివేస్తారని పరోక్షంగా ఆయన ఏపీలో కూడా వేలుపెట్టాలని సూచన చేసినట్లు మాట్లాడారు.

మామలుగా కుటిల / వ‌్యూహాత్మ‌క‌ రాజకీయాల్లో అమిత్ షాకు తిరుగులేదు. ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఆయన రాజకీయ చతురతతోనే మెజారిటీ లేకపోయిన కర్నాటక, గోవా, మణిపూర్ లలో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. అటు అన్నాడీఎంకెని గుప్పిట్లో పెట్టుకుని తమిళనాడులో పెత్తనం చేస్తున్నారు. అలాగే ప్రత్యర్ధి నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించి వారిని లొంగదీసుకుంటారు. అందుకే ఏపీలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు.

అయితే ఇదే విధంగా ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న జగన్ ని అణిచివేయమని పవన్… అమిత్ షాని పొగిడినట్లు ఉంద‌న్న విమ‌ర్శ‌లు ప‌వ‌న్‌పై వ‌స్తున్నాయి. జగన్ పై ఉన్న సీబీఐ కేసుల ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టమని చెప్పినట్లు తెలుస్తోంది. కాకపోతే అమిత్ షా ఎత్తులు ఇతర రాష్ట్రాల్లో చెల్లేయేమో గానీ ఏపీలో మాత్రం కష్టం. ఏదేమైనా టీడీపీ-జనసేన-బీజేపీలు మూడు కలిసి కుట్రలు పన్నినా ఇప్ప‌ట్లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్న జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మే..!

Tags: Amit Shah, AP, comments, pawankalyan