టీఆర్ఎస్లో ఆ మంత్రికి ప‌ద‌వి ముచ్చ‌టే తీర‌కుండా క‌ష్టాలు…!

పాపం.. ఆయ‌న‌కు మంత్రి అయిన సుఖం లేదు.. ప‌ద‌వి వ‌చ్చిన రోజే సంబురం.. ఆ మ‌రుస‌టి రోజు నుంచి అంతా గాబ‌రానే.. పేరుకే మంత్రి.. పెత్త‌నం మాత్రం చేతిలో లేదు. సొంతంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం కాదుక‌దా.. అభిప్రాయం చెప్పుకునే అవ‌కావం కూడా లేద‌ట‌.. ఏడ్వ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక‌.. లోలోప‌ల కుమిలిపోతూ.. బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నాడ‌ట‌.. ఇంత‌కీ ఆ మంత్రి ఎవ‌ర‌కు.. ఆయ‌న‌కు వ‌చ్చిన క‌ష్టం ఏమిటి..? అని అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. తెలంగాణ ర‌వాణాశాఖ మంత్రి, ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో మంత్రి పువ్వాడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. 2014లో ఖ‌మ్మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజ‌య్‌కుమార్ ఆ త‌ర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే అదే  ఎన్నిక‌ల్లో ఆయ‌న చేతిలో ఓడిపోయిన తుమ్మ‌ల‌ నాగేశ్వ‌ర్‌రావును ఎమ్మెల్సీ చేసి  ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేబినెట్‌లోకి తీసుకుని ర‌వాణాశాఖ మంత్రి ప‌ద‌వి కట్ట‌బెట్టారు. దీనిపై అప్ప‌ట్లో పువ్వాడ తీవ్ర అసంతృప్తితో ర‌గ‌లిపోయిన‌ట్లు టాక్ ఉంది.

ఇక‌ 2018 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి మ‌ళ్లీ పువ్వాడ‌ గెలిచారు. కానీ, పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల‌ నాగేశ్వ‌ర్‌రావు ఓడిపోయారు. అయితే.. ఖ‌మ్మం నుంచి మంత్రివ‌ర్గంలో ప్రాతినిధ్యం ఉండాల‌ని భావించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనూహ్యంగా రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పువ్వాడ‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఆయ‌న కూడా మొద‌ట సంబుర‌ప‌డ్డారు. కానీ, మంత్రి అయిన సంబురం పువ్వాడ‌కు ఎక్కువ రోజులు మిగ‌ల్లేదు. సొంతంగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌మే లేదు. సొంత అభిప్రాయం చెప్పే ఛాన్సే ఉండ‌ద‌ట‌. అంతా సీఎం కేసీఆర్ చేతిలోనే. ఆయ‌న చెప్పిందే ఫైన‌ల్‌. రెండో మాట‌కు నో ఛాన్స్‌.

ఈ నేప‌థ్యంలోనే ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్రారంభం కావ‌డంతో ఇక మంత్రి పువ్వాడ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ట‌. హైకోర్టు విచార‌ణ నేప‌థ్యంలో రోజూ గంట‌ల కొద్దీ సీఎం కేసీఆర్ స‌మీక్ష‌. సైలెన్స్‌గా విన‌డం త‌ప్ప పువ్వాడ మాట్లాడ‌డానికి ఏమీ ఉండ‌ద‌ట‌. మ‌రోవైపు కార్మికుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సామాన్య జ‌నం నుంచే కాదు.. గులాబీ గూటిలోని ప‌లువురు కీల‌క నేత‌లు కూడా గుర్రుగా ఉన్నారు. మంత్రి పువ్వాడ‌పై సోష‌ల్ మీడియాలో తిట్ల‌దండం కూడా మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో పువ్వాడకు ప‌ద‌వి వ‌చ్చిన ముచ్చ‌ట తీర‌కుండానే వ‌రుస క‌ష్టాలు వెంటాడుతున్నాయి.

Tags: Khammam, Puvvada AjayKumar, Telangna, Transport Ministers, TRS PARTY, TSRTC Strike