కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ బోర్డు పెట్టి.. చివరాఖరికి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. సంచలనం రేకెత్తించే కథాంశాలను.. రాజకీయ ఆంశాలను.. నిత్యం వివాదస్పదంగా ఉండే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి ఎవ్వరికి నిద్ర లేకుండా చేస్తున్న వర్మ ఇప్పుడు మరో కథను రెడి చేసుకుని చిత్రం తెరకెక్కించే పనిలో పడిపోయాడు. తాను తీసే సినిమాలు హిట్టా.. ఫట్టా అనే ఫలితం కోసం ఎదురు చూడకుండా ఉండే వర్మ ఇప్పుడు మరో కథతో రెడిగా తయారయ్యాడు.
ఇప్పుడు అసలే సరైన కథలు లేకుండా ఎందరో దర్శకులు నానా యాతన పడుతున్నారు. కొందరు దర్శకులు కథలు ఉన్నా ఆదరించే హీరోలు, పెట్టుబడి పెట్టె నిర్మాతలు లేకపోవడంతో సతమతమవుతున్నారు. అయితే ఇప్పుడు వర్మకు ఈ సమస్య లేకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడ ఎవ్వరు కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. రాజకీయ వైరుధ్యం వచ్చిందంటే.. ఎక్కడైనా చిన్నపాటి ఫ్యాక్షనిజం ఉందంటే అక్కడే తనకు కథను పట్టేస్తాడు. అందుకే తాను ఇటీవల నిర్మిస్తున్న చిత్రాలన్నీ ఇదే కోవలో ఉంటున్నాయి.
అయితే ఇప్పుడు వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఫలితంతో పని లేకుండానే మరో కథను సిద్దం చేసుకున్నాడు. అదే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదల కోసం వర్మ పడిన ఇబ్బందులకు ఓ రూపమిచ్చి దీన్నే తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నాడని సమాచారం. సినిమా రూపొందించినప్పటి నుంచి అనేక సమస్యలు, వివాదాలు చుట్టుముట్టాయి. అంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తే ఎన్ని కష్టాలు వస్తాయో తెలియజెప్పెదే ఈ సినిమా కథ అని సమాచారం. సినిమా కథ ఎంపిక నుంచి చివరికి విడుదల వరకు జరిగే ప్రక్రియ.. అందులో వచ్చే సాధకబాధకాలను తెరమీదకు తేబోతున్నాడని ఇదే కథ అని తెలుస్తుంది.
ఏదేమైనా కుక్కపిల్ల.. సబ్బు బిల్ల.. అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు ఓ మహానుభావుడు.. ఇప్పుడు దాన్ని తనకు అనుకూలంగా అన్వయించుకుని సినిమాలకు కూడా ఏదైనా ఒక్క పాయింట్ దొరికితే అదే కథగా మార్చుకుని సినిమా చేస్తానని నిరూపిస్తున్నాడు ఈ సంచలన దర్శకుడు వర్మ. వర్మా మజాకా.. ఇప్పుడు తయారు చేసుకున్న కథతో సినిమా తీసి సెన్సార్ బోర్డును ఉతికి ఆరేస్తాడు కావొచ్చు మరి. వేచి చూడాల్సిందే.