బరువు తగ్గడంతో బయోపిక్‌ అవకాశం కోల్పోయిన కీర్తి సురేష్‌

చిత్రసీమలో కొనసాగాలంటే ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. అందులో మరి ముఖ్యంగా హరోయిన్లు. ఎందుకంటే ఏ మాత్రం బరువు పెరిగినా, మరీ సన్నగా తయారైనా అవకాశాలు చేజారిపోతాయి. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్‌. బరువు తగ్గిన నేపథ్యంలో ప్రముఖ బాలివుడ్‌ స్టార్‌ నటిస్తున్న ఓ బయోపిక్‌ సినిమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చిందని సమాచారం. ఆ అవకాశాన్ని మరో మలయాళి భామ ఎగరేసుకుపోయిందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. 1952 నేపథ్యంలో పుట్‌బాల్‌ ఆటగాడు సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత గాథ ఆధారంగా అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. బోనికపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలివుడ్‌ స్టార్‌ అజయ్‌దేవగాణ్‌ లీడ్‌ రోల్‌ను పోషిస్తున్నారు. సినిమాలో ఆయనకు జోడిగా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్‌ను దర్వకనిర్మాతలు ఎంపిక చేశారు. సినిమాలో అజయ్‌దేవగాన్‌కు కీర్తి భార్యగా కనిపించాల్సి ఉంది. ఇదిలా ఉండగా చిత్రం ఒకే అయినప్పటి నుంచి కీర్తి రోజురోజుకూ బరువు తగ్గిపోయిందట. ఇప్పుడదే అసలు సమస్యగా మారిందని తెలుస్తున్నది. సన్నగా మారిన కీర్తి సురేష్‌ అజయ్‌దేవగాన్‌ సరసన చిన్నపిల్లలా ఉంటుందని చిత్ర బృందం భావించిందట. ఇదే విషయమై కీర్తితో చర్చించగా అందుకు ఆమె కూడా సమ్మతం తెలిపిందని తెలుస్తుండడం విశేషం. ఇక అజయ్‌ సరసన కేరళ కుట్టి, తెలుగు చిత్రసీమలో ఒక వెలుగు వెలిగిన ప్రియామణి అయితే సరిపోతుందని భావించిన చిత్రబృందం ఆమెను సంప్రదించిందట. పల్లు కూడా సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిందని సమాచారం. దీంతో కీర్తి సినిమా ప్రియామణి ఖాతాలోకి చేరిపోయింది. మరి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ బయోపిక్‌ నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags: ajay devagaon, football player biopic, Keerthi Suresh, priyamani