80వ దశకంలో తన మత్తు కళ్ళతో తనదైన అందచందాలతో చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిజానకి ఈమె పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆమె అందమనే చెప్పాలి. ఇక సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి గ్రామంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న వయసులోనే సినిమాల్లో నటించాలనే కోరికతో ఉండేది.
కానీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలి..? అన్నది మాత్రం ఆమెకి తెలియదు.. అంతే కాకుండా సిల్క్ స్మితకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు తల్లిదండ్రులు.. ఆ తర్వాత అత్తింటి వేధింపులు తట్టుకోలేక తన పిన్ని గారి ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన పిన్నితో కలిసి మద్రాసులో అడుగు పెట్టింది. అక్కడ జీవనం సాగించడం కోసం కొందరి ఇళ్లల్లో పని మనిషిగా కూడా పని చేసింది. ఇక ఈ క్రమంలోనే తన పిన్నికి బాగా తెలిసిన వారి ద్వారా అప్పటి స్టార్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో కూడా సిల్క్ స్మిత పనిమనిషిగా చేసింది.
ఇక సిల్క్ స్మితకు చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం.. జీనత్ అమన్ లాంటి గొప్ప డాన్సర్ కావాలని కోరిక ఉండేది.. ఇక తమిళనాడులో ఓ పనిమనిషిగా పనిచేస్తున్న సమయంలోనే ఓ దర్శకుడు కంటపడటంతో సినిమా అవకాశాలను అందుకుంది. ముందుగా సైడ్ డాన్సర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఒక్క మగాడు ఒక ఆడది సినిమా ద్వారా ఆమె తొలిసారిగా వెండితెరకు పరిచయం అయింది.
ఇక ఐటమ్ సాంగ్స్ కి డాన్స్ చేయడం మొదలుపెట్టాక ఆమె కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ డం సంపాదించుకున్న సిల్క్.. ప్రేమలో మోసపోయింది. బ్రేకప్ జరగడంతో మద్యానికి బానిసై సినిమాలపై ఫోకస్ తగ్గించింది. ఆ తరువాత చాలాకాలం మానసిక సంఘర్షణకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుని ఈ లోకానికి దూరమైంది.