అన్నగారు ఎన్టీఆర్‌కు పౌరాణిక సినిమాలంటే ప్రాణం. మనసు పెట్టి ఆయన సినిమాలు చేసేవారు. దీంతో ఆయన తీసిన సినిమాలు.. సినిమాలుగా కాకుండా.. కళ్ల ముందు కదులుతున్న రామాయణ, మహాభారతా లుగా ఉండేవి. ఇలా.. అన్నగారి పౌరాణిక సినిమాలకు చాలా ప్రత్యేకత ఉన్న విషయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా చర్చకు వస్తున్నాయి.
ఇదిలావుంటే.. అన్నగారు తాను రావణాసురిడిగా నటిస్తూ.. స్వయంగా దర్శకత్వం వహించి ఎన్ ఏటీ కంబైన్స్ బ్యానర్‌పై తీసిన సినిమా సీతా కళ్యాణం. దీనిలో హరినాథ్ రాముడిగా, జయప్రదను సీతగా అన్నగారు పరిచయం చేశారు. ఈ సినిమా అంతా కూ డా.. రావణాసురిడి జీవిత చరిత్ర చుట్టూ తిరుగుతుంది. అయితే.. చిత్రం ఏంటంటే.. రాముడి పాత్రను ఇందులో చూపించినట్టుగా మరే సినిమాలోనూ ఎవరూ చూపించలేదు.
ఈ సినిమాలో రాముడి పాత్రకు రాసిన డైలాగులు మొత్తంగా ఒక పేజీ మించలేదు. అదేమని అడిగితే.. అన్నగారు అద్భుతమైన మాట చెప్పారు. రాముడంటే.. మాటల మనిషి కాదోయ్. చేతల మనిషి. అందుకే మాటలు ఉండవు. ఆయనవన్నీ.. చేయడమే అని చెప్పేవారు. ఇక, సీతాదేవి పాత్రకు అరపేజీ డైలాగులు. ఈ విషయాన్ని ప్రస్తావించిన పలువురికి అన్నగారు చెప్పిన సమాధానం ఆశ్చర్యం అనిపిస్తుంది. సీత.. భర్త మాటను పరమావధిగా పాటించే సాధ్వీమణి. ఆవిడ నోరు విప్పదు. అందుకే మాటలు లేవు అని చెప్పుకొచ్చారు.
ఇక, సీతాకళ్యాణం అన్నగారి సినిమాల్లో ఒక మైలు రాయిగా నిలిచింది. సూపర్ హిట్ కొట్టింది. ప్రీరిలీజ్ ఫంక్షన్ చేశారు. అయితే.. ఏదో నాలుగు ముక్కలు ప్రసారం చేసి వదిలేయలేదు. మొత్తం 3 గంటల సినిమాను కూడా ఈ పంక్షన్‌లో ప్రదర్శించడం విశేషం. దీనికి ఆనాటి గవర్నర్, సీఎం సహా మంత్రి వర్గ సభ్యులు అందరూ హాజరై.. ఆసక్తిగా వీక్షించారు.