ఎన్టీఆర్ – బాల‌కృష్ణ కాంబినేష‌న్లో మిస్ అయిన మ‌ల్టీస్టార‌ర్… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

నందమూరి కుటుంబంలో నటసింహం బాలకృష్ణ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీ స్టార్ సినిమా వస్తే నందమూరి అభిమానులకు, తెలుగు సినీ అభిమానులకు అంతకు మించిన ఆనందం ఉండదు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ కాంబినేషన్లో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించిన సినిమాలో బాలకృష్ణ తన తండ్రితో కలిసి ఎన్నోసార్లు నటించారు. ఇందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.

దానవీరశూరకర్ణ సినిమాలో అయితే ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ కలిసి నటించారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ రామ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు బాబాయ్ బాలయ్యతో కలిసి భార్గవ రాముడు సినిమాలో నటించాడు. ఇక ఈ తరం జనరేషన్ లో ఎన్టీఆర్ – బాలయ్య, ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్, కళ్యాణ్ రామ్ – బాలయ్య కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎన్నో ఆశలతో ఉన్నారు.

అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో కనిపించారు. నందమూరి కుటుంబానికి అభిమాని అయిన దర్శకుడు వైవిఎస్ చౌదరి బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశారు. ఇందుకోసం ఆయన ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేసుకున్నారు. ఇందులో బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది.

అయితే ఈ మల్టీస్టార‌ర్ సినిమా తెరకెక్కించాలనుకున్న టైంలో బాలయ్య, ఎన్టీఆర్ వేరువేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో వై.వి.ఎస్ చౌదరి బాలయ్యతో ఒక్క మగాడు లాంటి సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. బాలయ్య ఎంతో నమ్మకంతో వైవిఎస్ చౌదరికి అవకాశం ఇస్తే ఒక్క మగాడు లాంటి పరమ చెత్త సినిమా తెరకెక్కించడంతో.. ఆ తర్వాత వైవిఎస్ చౌదరిని బాలయ్య అస్సలు తన కాంపౌండ్ కే రానివ్వలేదని అంటారు.

దీంతో వైవిఎస్ చౌదరి తెర‌కెక్కించాలనుకున్న మల్టీ స్టార‌ర్‌కు మధ్యలోనే బ్రేక్ పడిపోయింది. ఒకవేళ సినిమా హిట్ అయి ఉంటే ఆ తర్వాత చౌదరి బాలయ్య – ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సినిమా ఖచ్చితంగా తెర‌కెక్కించి ఉండేవారట. బట్ ఆ అదృష్టం ఆయన చేజేతులా మిస్ చేసుకున్నట్లయ్యింది.