ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఆ స్టార్ డైరెక్ట‌ర్ చెప్పిన జాత‌క‌మే కార‌ణ‌మా…?

బి. విఠలాచార్య. ఈయ‌న చాలా గొప్ప‌ ద‌ర్శ‌కుడు. ఈయ‌న సినిమాల‌కు పెట్టుబడి విష‌యంలో చాలా పొదుపుగా వ్య‌వ‌హ‌రించేవారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు.. నిర్మాత‌ల‌పై భారం ప‌డ‌కుండా చూసుకునేవారు. అదేస‌మ‌యంలో క‌థ‌లో న‌వ్య‌త‌, నాణ్య‌త‌, పాట‌ల‌కు.. సంగీతానికి మాత్రం ఏమాత్రం వెనుకాడేవారు కాదు. సాధ్య‌మైనంత మేర‌కు ఆర్టిస్టుల నుంచి కూడా న‌ట‌న‌ను రాబ‌ట్టుకునేవారు.

సాధార‌ణంగా.. హీరోల‌కు, హీరోయిన్ల‌కు.. అభిమానులు ఉంటే… ద‌ర్శ‌కుల విష‌యంలో బి. విఠ‌లాచార్య‌కు మాత్రం వీరిని మించిన అభిమానులు ఉండేవారు. అందుకే.. నిర్మాత‌లు కూడా అప్ప‌ట్లో సినిమా ప్ర‌చారా లకు వినియోగించిన వాల్ పోస్ట‌ర్ల‌పై బి. విఠ‌లాచార్య పేరును పెద్ద‌పెద్ద అక్ష‌రాల‌తో ముద్రించేవారు. అంత పాపులారిటీ సంపాయించుకున్నారు. చెన్నై స‌హా తెలుగు ప్రాంతాల్లో విఠ‌లాచార్య అభిమాన సంఘాలు ఉండేవంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

అంతేకాదు.. విఠ‌లాచార్య స‌మ‌యం, ముహూర్తం, తిథి వార న‌క్షత్రాలు చూసుకుని.. అన్నీ చ‌క్క‌గా ఉన్నా య‌ని.. నిర్ణ‌యించుకున్న త‌ర్వాతే.. ఆయ‌న సినిమాల‌ను విడుద‌ల చేసేవారు. దీంతో అవి ముహూర్త బ‌లం కావొచ్చు..దర్శ‌కుడిలో ఉన్న ప్ర‌తిభ‌కావొచ్చు.. భారీ ఎత్తున స‌క్సెస్ అయ్యేవి. ఇక‌, విఠ‌లాచార్య‌లో ఉన్న మ‌రో గొప్ప ల‌క్షణం.. సినిమా అంతా పూర్త‌య్యాక‌.. నిర్మాత ఇబ్బందులు తెలుసుకునేవారు. వాటిని బ‌ట్టి.. త‌న రెమ్యున‌రేష‌న్ తీసుకునేవారు.

త‌న రేటు ఇంత అని ఎప్పుడూ ఆయ‌న ఫిక్స్ చేయ‌లేదు. సొంత బ్యాన‌ర్‌పై సినిమాలు చేస్తే.. ముందు ఆర్టిస్టుల‌కు అడ్వాన్సులు పంపించేవారు. ఇలా, ఆయ‌న నిబద్ధ‌త‌త‌ను చాటుకున్నారు. ఇది న‌చ్చి అన్న‌గారు ఎన్టీఆర్ అనేక సినిమాల‌ను ఆయ‌న‌తో చేశారు. ఇక‌, విఠ‌లాచార్య జాత‌కాలు చూసేవారు. ఆయ‌న‌కు హ‌స్త‌సాముద్రికంతోపాటు న‌క్ష‌త్ర గ‌ణితంపైనా మంచి ప‌ట్టుంది. దీంతో ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌రే జాతకం చూపించుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అంటారు.