బీసీసీఐ చైర్మన్ పదవికి గంగూలీ నిజంగా రాజీనామా చేశారా? నిజమిదే ..!

బీసీసీఐ చైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్త వైరల్ గా మారింది. ఏకంగా బీసీసీఐ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి గంగూలీ రాజీనామా చేశారంటూ ట్వీట్ రావడంతో ఇది నిజం అని అందరూ నమ్ముతున్నారు. అయితే అది అధికారిక బీసీసీఐ ట్విట్టర్ హ్యాండిల్ కాదని ఫేక్ అని తెలుస్తోంది. ఇవాళ మార్నింగ్ నుంచి సౌరవ్ గంగూలీ బీసీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేశారని, గంగూలీ స్థానంలో కొత్త బీసీసీఐ చైర్మన్ గా జైషా నియమితులయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గంగూలీ రాజీనామా పై బీసీసీఐ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.

బీసీసీఐ చైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా చేస్తున్నారంటూ పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. గత జూన్ లో కూడా ఇదే విధంగా వార్తలు వచ్చాయి. అప్పుడు బీసీసీఐ ఈ వార్తలను కొట్టి పారేసింది. జూన్ 1వ తేదీన గంగూలీ చేసిన ఒక ట్వీట్ కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. ‘ నేను 1992 లో నా క్రికెట్ ప్రయాణాన్ని మొదలు పెట్టాను. 2022 తో నా జర్నీకి 30 ఏళ్ళు నిండాయి. నా ప్రయాణం లో భాగమైన, అండగా నిలిచిన, సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. చాలా మందికి సహాయపడుతుందని భావించే ఓ కొత్త ప్రాజెక్టును ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నా’ అని అప్పట్లో గంగూలీ ట్వీట్ చేశారు. గంగూలీ చేసిన ట్వీట్ తో ఆయన తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని అప్పట్లో ప్రచారం జరిగింది.

గంగూలీ కొద్దిరోజులుగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. బెంగాల్ ఎన్నికలలో గంగూలీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలుపుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు దాదాకు గుండెపోటు రావడంతో రాజకీయాల్లో అరంగేట్రం పై చర్చలకు ఫుల్ స్టాఫ్ పడింది. ఇటీవలికాలంలో అమిత్ షా బెంగాల్ లో పర్యటించిన సమయంలో కోల్ కతా లోని గంగూలీ ఇంటికి వెళ్లారు. అప్పట్లో ఆయన గంగూలీకి రాజ్యసభ పదవి ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి గంగూలీ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Tags: BCCI President, cricketer sourav ganguly, indian cricketers, sourav ganguly