లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ మూవీ..!

విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా టాప్ లీగ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరాడు లోకేష్ కనకరాజ్. ఆ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య హీరోలుగా నటించారు. ఈ సినిమాలో అంతమంది స్టార్ హీరోలు నటించినా వారి స్థాయికి తగ్గట్టుగా తీర్చిదిద్దాడని ప్రశంసలు వచ్చాయి. కమలహాసన్ అయితే ఈ సినిమా ద్వారా దాదాపు 15 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తమిళ అగ్ర హీరో విజయ్ హీరోగా మరో సినిమా రూపొందిస్తున్నాడు. తాజాగా లోకేష్ తన నెక్ట్స్ ప్రాజెక్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్ మాతృక అయిన మలయాళం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తమిళంలో సూర్య, కార్తీతో చేయాలని ఉందని కామెంట్స్ చేశాడు.

ఇప్పటికే విక్రమ్ సినిమాలో సూర్యను నెగటివ్ క్యారెక్టర్ లో అద్భుతంగా చూపించాడు కనకరాజ్. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా గా అయ్యప్పనుమ్ కోషియమ్ తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఒకవేళ తాను ఈ సినిమా ప్రారంభిస్తే బిజు మీనన్ పాత్రలో సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కార్తీని తీసుకుంటానని వెల్లడించారు.

దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా చేయాలని సూర్య, కార్తీ ఫ్యాన్స్ లోకేష్ కనకరాజ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ కార్తీ హీరోగా చేసిన ఖైదీ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దీంతో సూర్య-కార్తి-లోకేష్ కాంబినేషన్లో సినిమా రావాలని తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రూపుదాల్చి సెట్స్ పైకి వెళుతుందేమో చూడాలి.

Tags: director lokesh kanakarajan, hero surya, kollywood news, telugu news, tollywood remakes