ధ‌నుష్ – నాగార్జున మ‌ల్టీస్టార‌ర్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున గత కొంతకాలంగా వరుసగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన హిట్ రావడం లేదు. గత 7 – 8 సంవత్సరాలలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు ఓ మోస్త‌రుగా విజయం సాధించింది. అందులోనూ కృతిశెట్టి, నాగచైతన్య కూడా ఉండడంతో నాగర్జునకు సోలోగా హిట్టు దక్కింది అన్న క్రెడిట్ రాలేదు.

అనంతరం నాగార్జున నుంచి వరుసగా ఘోరమైన కళాఖండాలు రిలీజ్ అవుతున్నాయి. ఆఫీసర్ – వైల్డ్ డాగ్ – ది ఘోస్ట్ – మన్మధుడు 2 ఇలా ఏ సినిమా చూసినా అరివీర భయంకరమైన డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. అయితే నాగార్జున మరో హీరోలతో కలిసిన నటించిన సినిమాలు మాత్రం ఓ మోస్త‌రుగా ఆడుతున్నాయి. హిందీలో బ్రహ్మాస్త్ర, అప్పుడెప్పుడో కోలీవుడ్ హీరో కార్తీతో కలిసి చేసిన ఊపిరి సినిమాలు ఒక మోస్త‌రుగా ఆడాయి.

తాజాగా నాగర్జున కోలీవుడ్ స్టార్ హీరోతో కలిసి మరో మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ‌ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు – తమిళ – హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో నాగార్జున కూడా మరో హీరోగా కనిపిస్తాడని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు నారాయణదాస్ నారంగ్‌, పున్కూర్ రామ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.