సీఎం జ‌గ‌న్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా సీబీఐ..!

ఏపీ సీఏం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికా విప‌క్ష టీడీపీని ఢీకొట్టి రికార్డు స్థాయిలో సీట్ల‌తో అధికారం చేప‌ట్టారు. కానీ సీబీఐ ముందు మాత్రం డీలా ప‌డిపోతున్నారు. సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్బెస్టిగేష‌న్ ఆయ‌న‌కు తీర‌ని త‌ల‌నొప్పిగా మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు నేటికీ ఏదో ఒక చిక్కును తెచ్చిపెడుతున్న‌ది. ముప్పు త‌ప్ప‌లు పెడుతున్న‌ది. ఇప్ప‌టికే మ‌నీల్యాండ‌రింగ్‌, ప‌లు కీల‌క కేసుల‌కు సంబంధించిన కేసుల్లో వ్య‌క్తిగ‌త హాజ‌రును మిన‌యించాల‌ని సీబీఐ కోర్టును సీఎం జ‌గ‌న్ ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. అందుకు అభ్యంత‌రం తెలుపుతూ సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశముంద‌ని వివ‌రిస్తూ జ‌గ‌న్ పిటిష‌న్‌ను కొట్టివేయాల‌ని సీబీఐ కోరిన సంగ‌తి విధిత‌మే.

తాజాగా మ‌రోసారి జ‌గ‌న్‌కు అడ్డుత‌గిలింది సీబీఐ. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అందుకు తాము అన్న‌విధాలా సిద్దంగానే ఉన్నామని ఏపీ హైకోర్టుకు తెలియజేసి వైసీపీకి షాక్ ఇచ్చింది. ఇప్పుడిదే తీవ్ర చర్చనీయాంశమవుతున్న‌ది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని.. సీబీఐకి కేసును అప్ప‌గించాల‌ని కోరుతూ అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జగన్, వివేకా కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్సీ టెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అధికారంలోకి వ‌చ్చాక ఏమ‌నుకున్నారో ఏమో గానీ జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని మార్చ‌కున్నారు. త‌న పిటిషన్‌పై ఉత్తర్వులు వద్దని అఫిడవిట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా మిగతా అందరూ మాత్రం సీబీఐ విచారణపై గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయ‌మై సీబీఐ అభిప్రాయాన్ని హైకోర్టు అడ‌గ‌గా, విచారణ చేపట్టేందుకు సుముఖంగానే ఉన్నామని సీబీఐ తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా ప్రభుత్వం తరపున అభిప్రాయం చెప్పడానికి మాత్రం అడ్వొకేట్ జనరల్ సిద్దంగా లేన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇప్పటి వరకూ ప్రభుత్వం తరపున పలు కేసుల్లో వాదించిన ఏజీ వివేకా కేసు విచారణకు సంబంధించి నేటికీ కోర్టు హాల్లోకి రాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న‌ది. తన వ‌ద్ద కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవని వాయిదా కోరిన ఏజీ నిన్న అసలు కోర్టుకే హాజరు కాక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తున్న‌ది. విచారణ కావాలంటే ఒక సమస్య.. వద్దంటే మరో సమస్య వచ్చి పడుతుంద‌ని, అందుకే వీలైనంత వరకూ వాయిదాలతో గడిపేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్న‌ట్లు అభిప్రాయం కలుగుతోంది. ఇదిలా ఉండ‌గా ఈ కేసు విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

Tags: ap cm jagan mohanreddy, cbi enquri, ys viveka murder case