ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని రాజకీయం విచిత్రం టిడిపితో రాజకీయం ప్రారంభించిన రజని అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీలో సూపర్ పాపులర్ అయ్యారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసి తన వాగ్దాటితో అందరూ చూపు తనవైపు పడేలా చేశారు. టిడిపికి పెద్ద షాక్ ఇచ్చి ఎన్నికలకు ఐదు.. ఆరు నెలల ముందే ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలలో ఆమె టిడిపికి చెందిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించటం.. ఇక ఇప్పుడు ఏకంగా మంత్రి అయిపోవడం చకచక జరిగిపోయాయి. రజని తాజాగా చిలకలూరిపేటలో జరిగిన సభలో తన రాజకీయ జీవితం.. తన ఎమ్మెల్యే పదవి.. ఈ మంత్రి పదవి జగనన్న ఇచ్చిన బిక్ష అని.. ఆయన రుణం తీర్చుకోలేనిది అని ప్రకటించారు.
అయితే గతంలో ఆమె చంద్రబాబును కూడా సార్ నేను మీరు సైబరాబాద్ లో నాటిన మొక్కను నేను.. వృక్షాన్ని అయ్యి మీ ముందు ఉన్నాను అని ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే. రజనీ విషయంలో అటు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసి.. ఇప్పుడు చంద్రబాబును తిడుతున్న వీడియోలు.. అలాగే జగన్ ఆకాశానికి ఎత్తుతున్న వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటి సంగతి ఎలా ఉన్నా రజని మాత్రం రాజకీయంగా అతి తక్కువ సమయంలోనే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు.
ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఈ జగనన్న చెల్లికి వచ్చే ఎన్నికలలో చిలకలూరిపేట జనాలు పెద్ద షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఏ సర్వే కూడా చిలకలూరిపేటలో వచ్చే ఎన్నికలలో రజని గెలవరనే చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైసీపీకి అనుకూలంగా ఉండే ఓ ప్రముఖ సర్వేలో టిడిపి 4500 ఓట్ల ఆధిక్యతతో కనిపిస్తోంది.
అలాగే ఆత్మశాక్షి సర్వేలోనూ ఆ పార్టీ 6 వేల ఓట్ల లీడింగ్ లో ఉంది. ఇక మరో సర్వేలో కూడా అక్కడ టిడిపి ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజార్టీతో దూసుకుపోతుంది. ఈ మూడు సర్వేలలోనూ మంత్రి విడుదల రజని ఓడిపోతారని క్లియర్ గా కనబడుతోంది. గత ఎన్నికలలో వైసిపి ప్రభంజనంలోనూ రజని అక్కడ కేవలం ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే రజని వెనకంజలో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
ఇక ఇప్పటివరకు వ్యాహాత్మకంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సైతం ఇప్పుడు దూకుడు పెంచుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు ఇంకా యేడాది సమయం ఉండడంతో ఈ ఏడాదిలో పుల్లారావు వర్సెస్ రజినిమధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయం ఎలా ? మారబోతుంది. చివరకు ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది చూడాల్సి ఉంది.