ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురంలో వరుసగా మూడోసారి పోటీ చేసి హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి ఆయనకు పెద్దాపురంలో లోకల్ సెగ గట్టిగా తగలనుంది. కోనసీమ ప్రాంతానికి చెందిన రాజప్ప 2014 ఎన్నికలలో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి చిత్తుగా ఓడిపోయిన పెద్దాపురంలో మాత్రం ఆయన రెండోసారి విజయం సాధించారు.
వైసిపి నుంచి పోటీ చేసిన తోటవాణిపై కేవలం నాలుగు వేల ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం రాజప్పకు అనుకూలంగా పనిచేయడంతోనే ఆయన విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాజప్ప మీద నియోజకవర్గంలో అసమ్మతి ఉంది. దీనికి తోడు కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఇటీవల చంద్రబాబు పెద్దాపురం వచ్చినప్పుడు వచ్చే ఎన్నికలలోను రాజప్పే అక్కడ నుంచి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు.
అయితే ఈసారి కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాలు.. పార్టీని అభిమానించే కొత్త తరం యువత అందరూ కూడా రాజప్పకు ఈసారి తాము సహకరించేతలేద..ని కొత్తతరం నాయకులకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడో కోనసీమ ప్రాంతానికి చెందిన రాజప్పను తీసుకువచ్చి పెద్దాపురంలో నిలబెడితే రెండుసార్లు నెత్తిన పెట్టుకొని గెలిపించామని.. ఈసారి లోకల్ నాయకులకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.
పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బొడ్డు భాస్కర రామారావు కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరి – గుణ్ణం చంద్రమౌళి వీరిలో ఎవరో ఒకరికి ఈసారి పెద్దాపురం టికెట్ ఇవ్వాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీరిలో వెంకటరమణ చౌదరి 2014 ఎన్నికలలో రాజమండ్రి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు నియోజకవర్గంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బలమైన అనుచరగణం ఉంది.
అలాగే వెంకటరమణ చౌదరి పెద్దాడ గ్రామానికి సర్పంచ్ గా కూడా పనిచేశారు. సౌమ్యుడుగా ఉంటారన్న పేరు ఉంది. ఇక గుణం చంద్రమౌళికి కూడా మంచి పేరు ఉంది. ఆయన కూడా ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఏది ఏమైనా ఈసారి పెద్దాపురంలో చినరాజప్పకు సీటు ఇస్తే టిడిపికి ఎదురు దెబ్బలు తప్పేలా లేవు.