బాబు… అక్క‌డ పార్టీని గాలికొదిలేశారా…!

టీడీపీ కంచుకోట‌లుగా చెప్పుకునే ఉభ‌య గోదావ‌రి పార్టీకి బీట‌లు వారాయి. ఇటీవ‌లి ఫ‌లితాల్లో పార్టీ తేలిపోయింది. అప్ప‌టి నుంచి పార్టీని వీడుతున్న ముఖ్య‌నేత‌ల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. క్ర‌మంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాలు బ‌ల‌హీనంగా మారాయి. త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో టీడీపీ అధినేత‌, ముఖ్య‌నేత‌లు చొర‌వ లేక‌పోవ‌డంతో అంత‌కంత‌కూ పార్టీ గ‌తిత‌ప్పుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామంచంద్ర‌పురం, పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించే నాథుడే లేక‌పోవ‌డంతో శ్రేణులు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. పార్టీని ముందుండి న‌డిపించే నాయ‌కుడే లోడ‌ని కార్య‌క‌ర్త‌లు మ‌నోధైర్య కోల్పోతున్నారు.

వాస్త‌వానికి తోట త్రిమూర్తులు పార్టీలో ఉన్నంత కాలం రామచంద్రాపురంలో టీడీపీ బలంగానే ఉంది. కానీ ఆయ‌న  ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో ఓట‌మిని చ‌విచూశాక వైసీపీలోకి మారిపోయారు. ఇక ఆయన వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి  నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది.  పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌నంలోకి వెళ్ల‌డం లేదు. జెండా ప‌ట్టుకునే వారే లేర‌ని వైసీపీ నేత‌ల నుంచి ఎద్దేవా విమ‌ర్శ‌లు మొద‌ల‌వ‌డంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అవ‌మానంతో ర‌గిలిపోతున్నారు.

పార్టీ పుంజుకోవ‌డానికి అవ‌కాశం ఉన్నా పార్టీ అధినేత ఇలా నియోజ‌క‌వ‌ర్గ పార్టీని గాలికి వ‌దిలి వేయ‌డం ఏంట‌న్న విమ‌ర్శ‌లు కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో  పి. గన్నవరంలో టీడీపీలో కూడా పార్టీ ప‌రిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో  పోటీ చేసి ఓడిపోయిన నేలపూడి స్టాలిన్ బాబుని…ఇటీవల చంద్ర‌బాబు టీడీపీ నుంచి  సస్పెండ్ చేశారు. ఆయన సస్పెండ్ అయ్యాక నియోజకవర్గంలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండాపోయింది.  2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి నారాయణమూర్తికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా స్టాలిన్ కి టికెట్ ఇచ్చారు.

దీంతో పులపర్తి ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇవ్వలేదు. ఫ‌లితంగా ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. నారాయ‌ణ‌మూర్తి కొద్దికాలం క్రితం బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. క‌నీసం ఆయ‌నైన పార్టీలో కొన‌సాగితే ఎంతో కొంత బెట‌ర్ ఉండేది నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి అంటూ కార్య‌క‌ర్త‌లు నిట్టూరుస్తున్నారు.  ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో త్వ‌ర‌లో స్థానిక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు రానున్నాయి. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో పార్టీ ఇన్చార్జిల‌ను ప్ర‌క‌టించ‌క‌పోతే టీడీపీ ఖాతా క్లోజ్ అయిన‌ట్లేన‌ని చెబుతున్నారు.

Tags: AP, ChandrababuNaidu, EastGodavari District, P Gannavaram, Ramachandrapuram, tdp