ఫిరాయింపుపై జ‌గ‌న్ ద్వంద వైఖ‌రి…!

పొలిటిక‌ల్ ఫిరాయింపు! ఈ మాట అంటేనే వైసీపీలో ఒక‌ప్పుడు కంప‌రం. ఒక పార్టీ టికెట్‌పై ప్ర‌జ‌ల్లో తిరిగి, వారి ఓట్లు వేయించుకుని గెలిచిన నాయ‌కుడు మ‌రో పార్టీలోకి జంప్ చేయ‌డ‌మే ఫిరాయింపు. గ‌త ఐదేళ్ల‌లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. దీంతో ఫిరాయింపు అంటేనే వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈస‌డించుకున్నారు. ఇలాంటి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించే పార్టీలు ప్ర‌జాస్వామ్యంలో వృధా అంటూ.. త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నుంచి త‌న పార్టీలోకి వ‌చ్చే వారు ఎవ‌రైనా స‌రే.. స‌ద‌రు పార్టీ ద్వారా ద‌ఖ‌లు ప‌డిన ప‌ద‌వుల‌ను వ‌దులుకుని రావాల‌ని ఆయ‌న కండిష‌న్ పెట్టారు. ఇలా వ‌చ్చిన వారే శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.

2017లో ఆయ‌న టీడీపీ ఎమ్మెల్సీగా అప్పుడే ఎన్నియ్యారు. ఇంత‌లోనే నంద్యాల ఉప ఎన్నిక రావ‌డం శిల్పా సోద‌రుడికి టీడీపీ టికెట్ ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయ‌న జ‌గ‌న్ గూటికి చేరిపోవ‌డం, వైసీపీ టికెట్‌పై పోటీ చేయ డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సోద‌రుడి వెన‌కాలే.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న శిల్పా చ‌క్ర‌పాణి.., ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఇలా వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పార‌ద‌ర్శ‌క‌త‌ను నిరూపించుకు న్నారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న అధికారంలోకి వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో మ‌రోసారి ఫిరాయింపుల‌పై తానే క‌ల్పించుకుని ఏపీ అసెంబ్లీ తొలి స‌భ‌లోనే త‌న అభిప్రాయాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఎవ‌రు పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకోవాల‌న్నా.. వారి వారి ప‌ద‌వుల‌కు రాజీనామా స‌మ‌ర్పించాల్సిందే! అని చెప్పారు. క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ ఈమాట చెప్పి ఐదు మాసాలే అయింది. ఇంత‌లోనే రాష్ట్రంలో టీడీపీలో తీవ్ర సంచ‌లనం సృష్టిస్తూ.. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలోనే పార్టీ అధి నేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

స‌రే! ఇప్పుడు ఆయ‌న తన‌కు టీడీపీ టికెట్ ద్వారా ల‌భించిన ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకోకుండా కేవ‌లం పార్టీకి మాత్ర‌మే రిజైన్ స‌మ‌ర్పించి.. తాను వైసీపీకి మ‌ద్ద‌తిస్తాన‌ని, జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తాన‌ని చెప్పుకొచ్చారు. అంటే.. దీనిని బ‌ట్టి ఇదిఫిరాయింపు కింద‌కు రాద‌నేది వైసీపీ వాద‌న‌. వైసీపీ తీర్థం పుచ్చుకోకుండా..(అంటే గ‌తంలో వైసీపీ త‌ర‌ఫున క‌ర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక.. టీడీపీ తీర్థం పుచ్చుకోకుండా.. ఆ పార్టీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిచ్చిన‌ట్ట‌న్న‌మాట‌!) జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తిస్తే.. త‌ప్పులేద‌ని అంటున్నారు. అలా కాకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటే మాత్ర‌మే ఫిరాయింపు కింద‌కు వ‌స్తుంద‌నేది వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్య‌గా వినిపిస్తోంది. మ‌రి ఫిరాయింపుపై ఈ ద్వంద్వ వైఖ‌రి ఏంటో ఆయ‌నే చెప్పాలి!!

Tags: AP, Party Defection, tdp, Vallabaneni Vamsi, YS Jagan, ysrcp