కాషాయ ద‌ళంలోకి బ్యాడ్మింట‌న్‌ క్రీడాకారిణి సైనా నెహ్వ‌ల్‌

ఢిల్లీలో రాజ‌కీయం వేడెక్కుతున్న‌ది. అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ కొత్త స‌మీక‌ర‌ణాలు జ‌రుగుతున్నాయి. గ‌తేడాది జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా క్రికెట‌ర్ గౌతం గంభీర్ బీజేపీలో చేరారు. తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా బ‌రిలో నిలిచి ఘ‌న విజ‌యాన్ని సాధించారు. తాజాగా ఆయ‌న బాట‌లోనే సాగుతున్నారు హైద‌రాబాదీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సైనా నెహ్వ‌ల్‌.
బ్మాడ్మింట‌న్ కోర్టులో ష‌ట్ల‌ర్‌ల‌ను వాయువేగంతో సంధిస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పులు తిప్ప‌లు పెట్టే క్రీడాకారిణి సైనా నెహ్వ‌ల్ రాజ‌కీయ గోదాలోకి దిగారు. కాషాయ ద‌ళంలో చేరారు. బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి అరుణ్‌సింగ్ స‌మ‌క్షంలో సోద‌రి చంద్రాన్షుతో క‌లిసి ఆ పార్టీ స‌భ్య‌త్వాన్ని స్వీక‌రించారు. వారికి ఆయ‌న బీజేపీ కండువాల‌ను క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సైనా మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కష్టపడి పని చేసే వ్యక్తినని, దేశ సంక్షేమం నిరంతరం కృషి చేస్తున్న‌ ప్రధాని మోదీతో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని వివ‌రించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వ‌హిస్తార‌ని తెలుస్తున్న‌ది. కాగా నెహ్వాల్ గతంలోనూ ప‌లుమార్లు పీఎం మోదీని కలిశారు.

హర్యానా రాష్ర్టంలో జన్మించినా ఆమె హైదరాబాద్‌లోనే పెరిగారు. పుల్లెల గోపీచంద్ వ‌ద్ద‌ బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుని, 2015లో వరల్డ్ నంబర్ 1 మహిళా షట్లర్‌గా ఎదిగారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులను పొంద‌గా, మొత్తంగా 24 అంతర్జాతీయ టైటిళ్లను కైవ‌సం చేసుకున్నారు. 2018లో తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. బీజేపీలో చేరడంతో సైనా బ్యాడ్మింటన్ నుంచి రిటైరవుతారనే ఊహాగానాలు విన‌వ‌స్తున్నాయి.

Tags: badminton player sin nehwal, bjp leader arunsingh, chandranshu