తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా వైఎస్ఆర్పార్టీలోకి చేరతారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణాలను, చిట్కాలను సైతం ఆయన వివరించడం విశేషం. ఇదే విషయమై నారాయణస్వామి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించడం మొదలుపెడితే తెలుగుదేశం పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీలో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఒక్కరే మిగులుతారని వివరించారు. బాబు బావమరిది. ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం వైసీపీలో చేరతారని వ్యాఖ్యానించారు. అందులో ఎవరూ ఆశ్చర్యపోవాల్సి పనిలేదని, బాలకృష్ణపై ఉన్న పాత కాల్పుల కేసును తిరగదొడితే చాలని ఆయనే పార్టీ మారతారని ఉటంకించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
అయితే ఇతర పార్టీల నాయకులను బెదిరింపులతో వైసీపీలోకి చేర్చుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా ఆయన దాటవేయడం గమనార్హం. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. అమరావతి పేరిట ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తడం కొసమెరుపు.