సాక్షి పత్రిక‌పై లోకేష్ ప‌రువు న‌ష్టం దావా

సాక్షి దిన‌ప‌త్రిక‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప‌రువు న‌ష్టం దావా పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగేలా త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చురించింద‌ని ఆరోపించారు. అందుకు ప‌రిహారంగా రూ.75 కోట్ల ప‌రిహారాన్ని చెల్లించాల‌ని ఆ పిటిష‌న్‌లో కోరారు. ఈ మేర‌కు విశాఖ 12 అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో 6/2020 సూట్ పేరిట వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు ఈ మాజీ మంత్రి.

ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే అక్టోబ‌ర్ 22, 2019 సంవత్స‌రంలో చిన‌బాబు చిరుతిండి రూ.25 ల‌క్ష‌లండి అంటూ సాక్షిలో ఒక క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. అందులో నారా లోకేష్ తీసుకునే ఆహారం, అందుక‌య్యే ఖ‌ర్చు మొత్తాల‌ను ఆ ప‌త్రిక‌లో లెక్క‌ల‌తో స‌హా వివ‌రించింది. ఆ క‌థ‌నంపై అప్ప‌ట్లోనే నారా లోకేష్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క‌ట్టుక‌థ‌ల‌ను అల్లేందుకు పుట్టిన విష‌పుత్రిక సాక్షి దిన‌ప‌త్రికని పేర్కొంటూ ఏదీ తోచ‌క త‌న‌పై సిగ్గ‌మాలిన రాత‌ల‌ను రాస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. ఆ పోస్టుల‌ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. సాక్షి ప‌త్రిక‌పై మండ‌ప‌డ్డారు. తాజాగా అదే క‌థ‌నంపై ప‌రువు న‌ష్టం దావాను దాఖ‌లు చేశారు మాజీ మంత్రి నారా లోకేష్‌. అంత వ‌ర‌కు బాగానే క‌థ‌నం ప్ర‌చురిత‌మైన వెంట‌నే వ్యాజ్యం వేయ‌కుండా ఇప్ప‌డు ఉన్న‌ట్టుండి, ఇంత కాలం త‌రువాత వ్యాజ్యం దాఖ‌లు చేయ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌ని రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నాయి. ఇప్ప‌డు ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags: EX MINISTER NARA LOKESH, SAKSHI DAILY PAPER