సర్జరీతో ముక్కును సరిచేయించుకో.. అప్పుడే పెళ్లి చేసుకుంటా!

పెళ్లి చూపులు చూసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అన్ని లాంఛనలు పూర్తి చేశారు. వివాహ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. ఫంక్షన్‌ హాల్‌ బుకు చేసుకున్నారు. పెండ్లికి సంబంధించిన షాపింగ్‌లో నిమగ్నమయ్యారు. తీరా ఇప్పుడు ఆ వధువు పెళ్లి రద్దు చేసుకుంది. అదీ వరుడి ముక్కు బాగోలేదని. ఈ విషయం తెలిసి మీరే ఆశ్చర్యపోతే పాపం ఆ వరుడు, అతని తరుపు బంధువులకు ఇంకెంత్‌ షాకింగ్‌గా ఉంటుందో మీరే ఊహించుకోండి.

 

 

ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కోరమంగళకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఒక మ్యాట్రీమోని సైట్‌ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఇద్దరు కొద్ది రోజులు తెగ చాట్‌ చేసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో వారిరువురూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఇరుకుటుంబాల పెద్దలను సైతం ఒప్పించారు. సెప్టెంబర్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీన వివాహ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. అందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తుండగానే సదరు సాఫ్ట్‌వేర్‌ను పెళ్లి చేసుకోబోనని అందరినీ ఆ యువతి షాక్‌కు గురి చేసింది. దీంతో ఖంగుతిన్న కుటుంబీకులు అసలు విషయం ఆరా తీశారు. దీంతో పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని, చూడడానికి అంత బాగోలేదని, ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని ముక్కు సరిచేసుకోవాలని, అప్పుడే పెళ్లి చేసుకుంటానని ఆ యువతి తేల్చి చెప్పడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఈ విషయమై వరుడు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వధువు, ఆమె కుటుంబీకులపై కోర మంగళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కట్నకానుల కోసం, ఇతరత్ర ప్రేమ వ్యవహారాలతో పెళ్లిళ్లు ఆగిపోయిన సంఘటనలు చూశాం కానీ ఇలా ముక్కుబాగోలేదని వివాహాన్ని రద్దు చేసుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. అందుకే అంటారు పుర్రెకో గుణం, జిహ్మాకో రుచి.