నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు బెంచ్ కీలక తీర్పును ఇచ్చిన గంటల వ్యవధిలోనే మరో మలుపు తీసుకుంది. కేసులోని ఓ దోషి రాష్ట్రపతి క్షమాభిక్షను కోరుతూ అర్జీని పెట్టుకున్నాడు. దీంతో జనవరి 22న అమలు చేయాల్సిన ఉరితీత మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2012 డిసెంబర్‌లో బస్సులో వెళ్తున్న పారామెడికల్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం చేయడం, ఆపై దాడి చేసిన ఘటనలో పోలీసులు 6 నిందితులను అరెస్టు చేశారు. అందులో ఒకరు జైలులో ఆత్మహత్య చేసుకోగా, మరొకరు మైనర్ కావడంతో స్వల్పశిక్షతో విడుదలయ్యాడు. మిగతా నలుగురికి ఢిల్లీ కోర్టు ఉరిశిక్షను విధించింది. కేసులోని నలుగురు నిందితులు అక్షయ్‌కుమార్ సింగ్, ముఖేశ్‌గుప్తా, వినయ్‌శర్మ, పవనన్‌గుప్తా ఈ తీర్పును సమీక్షించాలని సుప్రీంను ఆశయ్రించారు. దానిని కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కోర్టు నిందితులకు డెత్ వారెంట్లను జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 ఏడుగంటలకు వారిని ఉరితీయాలని తీహారు జైలు అధికారులను ఆదేశించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం అధికారులు చేశారు. ట్రయల్స్‌ను కూడా ఇప్పటికే నిర్వహించారు. అయితే డెత్ వారెంట్లు జారీ అయిన అనంతరం ఇందరు నిందితులు ముఖ్‌శ్‌సింగ్, వినయ్‌శర్మ సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దానిని సైతం సుప్రింన బెంచ్ సోమవారం తిరస్కరించింది. దీంతో 22వ తేదీన ఉరితీయడం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఏర్పడ్డాయి. నిందితుల్లో ఒకరైన ముఖేష్‌సింగ్ తనకు మిగిలి ఉన్న చిట్టచివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ అర్జీ పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఉరిశిక్ష అమలు అంశం మళ్లీ సంధిగ్దంలో పడింది. మరోవైపు రాష్ట్రపతి వారికి క్షమాభిక్ష పెడతారా? తిరస్కరిస్తారా? అన్న ఉత్కంఠత నెలకొంది. సభ్యసమాజం మాత్రం నిందితులను సాద్యమైనంత త్వరంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నది.