దారితప్పిన భర్త.. దేహశుద్ది చేసిన భార్య

పెండ్లి చేసుకున్నాడు. బాసలెన్నో చేశాడు. కొద్దికాలం అన్యోన్యంగా ఉన్నాడు. అటుతరువాత దారి తప్పి తనకన్న వయస్సులో పెద్దదయిన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. నచ్చజెప్పినా వినలేదు. ఇక చివరికి చేసేదేమీలేక భర్తను, సదరు మహిళను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది ఓ భార్య. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా పద్మానగర్‌లో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..

 

కరీంనగర్‌కు చెందిన ఓ మహిళకు, యువకుడికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులు అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో ఒక్కసారిగా కలహాలు మొదలయ్యాయి. దీనిపై సదరు భార్య ఆరాలు తీయగా భర్త వేరొక స్త్రీతో అక్రమసంబంధం నెరుపుతున్నట్లు గుర్తించింది. ఇదే విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. అయినప్పటికీ సదరు భర్త తీరులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భార్యతోనే కలిసి ఉంటానని సదరు భర్త వాగ్దానం చేశాడు. అయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా యథావిధిగా తన అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

 

అయితే ఇటీవలె అనుమానం వచ్చిన భార్య తన భర్త కదలికలపై నిఘా పెట్టింది. అక్రమ సంబంధం కొనసాగుతున్నదని గుర్తించింది. ఈ నేపథ్యంలో బంధువులతో కలిసి పద్మానగర్‌లోని సదరు మహిళ నివాసానికి వెళ్లి భర్తతో సహా ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అంతటితో ఆగకుండా వారిద్దరికీ దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Tags: crime news