జేసీ సోదరులే మట్కా నిర్వాహకులు: పెద్దారెడ్డి

మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడే జిల్లాలో మట్కా దందాలను నిర్వహించారని తాడిపత్రి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేతీరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జేసీ సోదరులు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అని అభివర్ణించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జేసీ సోదరులు ఆయనపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ఓటమి చెందినప్పటి నుంచే ప్రజాస్వామ్య పాలన సాగుతున్నదని వివరించారు. జేసీ సోదరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అధికారం ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

సామాన్యులు, రైతులను అనేక ఇబ్బందులను గురిచేశారని ధ్వజమెత్తారు. నిబంధనలను పాటించకుండానే ట్రావెల్స్‌ బస్సులను నడుపుతున్నారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. చివరికి ఆలయాల నిర్మాణం కోసం వచ్చే విరాళాలను సైతం జేసీ దివాకర్‌ రెడ్డి స్వాహా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి, అక్రమాలకు, అప్రజాస్వామిక విధానాలకు జేసీ సోదరులు కేరాఫ్‌ అడ్రస్‌ అని అభివర్ణించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖడించారు. వాటిపై తాను బహిరంగ చర్చకు సిద్దమని, దమ్ముంటే ముందుకు రావాలని జేసీ సోదరులకు ఆయన సవాల్‌ విసిరారు.

Tags: CONDEMED JC DIWAKAR, THADIPATRI MLA PEDDAREDDY