జగన్‌పై రగులుతున్న వైసీపీ ఎంపీలు..

వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. కానీ అప్పుడే ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు, ఆధిపత్య పోరు పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. కొందరు నేతలకు ఒకరు అంటే ఒకరుకు అసలు పడటం లేదని అర్ధమవుతుంది. అందులో ముఖ్యంగా వైసీపీ తరుపున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎక్కువమంది అసంతృప్తి రాగాలు తీస్తున్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేలు అంటే వీరు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు. పైగా జగన్ కూడా తమని పట్టించుకోవడం లేదని రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇటీవల జరిగిన వైసీపీ ఎంపీల సమావేశంలో స్పష్టంగా బయటపడింది.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో కొందరు ఎంపీలు….ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసలు నియోజకవర్గాల్లో పనులు చేయనివ్వకుండా కొందరు ఎమ్మెల్యలు అడ్డుపడి అవమానిస్తున్నారని, జగన్ కూడా వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రోటోకాల్ కూడా తమకు ఇవ్వడం లేదని మార్గాని భరత్, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌ లాంటి వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నార‌ని టాక్‌..?

అటు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అయితే తెగ ఫైర్ అయిపోతున్నారట. మొన్నటివరకు బీజేపీలో ఉండి వచ్చిన ఈయనకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడైనా బీజేపీ నేతలని కలిసే చనువు ఉంది. కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉండటం వల్ల బీజేపీ పెద్దలని కలవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఇక నామినేటెడ్ పదవులు విషయంలో కూడా ఎమ్మెల్యేలు చెప్పినవాళ్లకే ఇస్తున్నారు తప్ప, తమని కూరలో కరివేపాకు లాగా తీసేస్తున్నారని ఎంపీలు విజయసాయిరెడ్డి దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. త‌మ వ‌ర్గానికి ప‌ద‌వులు ఇవ్వ‌డంతో పాటు నామినేటెడ్ ప‌నుల విష‌యంలోనూ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని వారంతా ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు టాక్‌.. ? దీంతో విజయసాయిరెడ్డి వారిని బుజ్జగించి ఈ విషయం జగన్ తో వివరిస్తానని చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే వైసీపీ ఎంపీలు పైకి కనిపించకపోయిన లోలోపల బాగానే రగిలిపోతున్నారు.

Tags: AP, Discontent, mp's, YS Jagan, ysrcp