తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాకినాడకు వాహనంలో చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో పోలీసులు హై అలర్ట్ విధించారు. 144 సెక్షన్‌ను విధించడమేగాక, భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పట్టణంలో ఏం జరుగుతుందోననే ఉద్రిక్తత వాతావారంణ నెలకొంది.
మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా కాకినాడ పట్టణంలో ఆదివారం రోజున వైసీపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనను నిర్వహించిన తెలిసిందే. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పవన్‌కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఏకవాక్య సంబోధనతో ” చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే నీవు ఒక నాయకుడివేనా” అంటూ అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరుసటి రోజున పవన్అభిమానులు నిరసన వ్యక్తం చేయడం, ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసంపై దాడికి యత్నించడం, దానిని వైసీపీ నేతలు అడ్డుకోవడం, ఆపై ఇరువర్గాలు బాహాబాహికి దిగడం విధితమే. ఈ ఘర్షణలో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ కాకినాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు హైఅలర్ట్ విధించారు. పట్టణంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అదీగాక పోలీసు యాక్టు 30 అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాన వీధుల్లో పోలీసులు భారీగా మోహరించగా, మరోవైపు ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం వద్ద కూడా భద్రతా బలగాలను పెంచారు. పట్టణంలో మళ్లీ ఏం జరుగదుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.