ఏపీ ప్ర‌భుత్వానికి టీడీపీ మ‌రో ఝ‌ల‌క్‌.. అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా ..!

శాస‌న‌మండ‌లి ర‌ద్దు తీర్మాణాన్ని ఆమోదించి పైచేయి సాధించామ‌ని భావించిన వైసీపీ ప్ర‌భుత్వానికి అంత‌లోనే మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆ బిల్లును అసెంబ్లీ లో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించుకోవాల‌నే ఆత్రుత‌లో ఉన్న 0సీఎం జ‌గ‌న్ స్పీడ్‌కు బ్రేకులు వేసింది.
సోమ‌వారం ఉద‌యం నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో శాస‌న మండ‌లి ర‌ద్దు అంశంపై చ‌ర్చించిన మంత్రులు దానిని ఆమోదించారు. ఇక దానిని అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించారు. అక్క‌డ ఆమోదింప జేసుకోని ఆ తర్వాత ఆ బిల్లును కేంద్రానికి పంపాల్సి ఉంది. కేంద్రం ఉభయ సభల్లో బిల్లును ఆమోదిస్తే మండలి రద్దయ్యే అవకాశాలుంటాయి.

ఇదిలా ఉండ‌గా ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని ముందుగానే నిర్ణ‌యించుకున్న టీడీపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల‌ని చూస్త‌న్న వైసీపీకి కొద్ది సేపటికి ముందు గ‌ట్టి షాకిచ్చింది. సోమవారం శాసనసభను నిర్వహించే అంశాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రస్తావించలేదని, అది స‌భ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ని పేర్కొంటూ గవర్నర్‌కు, స్పీకర్ తమ్మినేనికి ఆ పార్టీ లేఖ రాసింది. ఇప్పటికే ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారని, అదీగాక కేవ‌లం మూడు రోజులు మాత్రమే స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని బీఏసీలో నిర్ణయించారని.. ఇలా ఇష్టానుసారం సభను పొడిగించడ‌ సబబు కాదని ఆ పార్టీ అభ్యంత‌రం తెలిపింది. ఇక శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీలో చర్చించడం రూల్స్‌‌కు విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధంగా జరిగే చర్చలో పాల్గొనకూడదనే సభను బహిష్కరించామని టీడీపీ శాసన సభాపక్షం వెల్లడించింది. దీంతో శాసన సభ సమావేశం ప్రారంభం కాగానే.. అసెంబ్లీ సమావేశాలను కొనసాగింపు కోసం బీఏసీ భేటీ ఏర్పాటు చేయాలని సీఎం జ‌గ‌న్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. అనంతరం సభను వాయిదా వేశారు. అయితే బీఏసీ సమావేశానికి టీడీపీ హాజరవుతుందా ? లేదా? అనేది ఇప్ప‌డు ఆసక్తికరంగా మారింది.

Tags: ap cm jagan mohanreddy, speaker thammineni setharam, tdlp