ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కృష్ణా జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్లిపోతున్నారు. ఇటీవలే గుడివాడ టిడిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ టిడిపికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆయనకు వైసిపి తూర్పు నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సైతం వైసీపీలోకి వెళతానని ఇప్పటికే ప్రకటన చేశారు. ప్రధానంగా కృష్ణా జిల్లా టిడిపిలో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే పార్టీ నుంచి బయటకు వెళుతున్న వారందరూ మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ చేస్తున్నారు.
గతంలో పార్టీని వీడిన ప్రస్తుత మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, దాసరి బాలవర్ధనరావు సోదరులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉమా తీరుతో వేగలేక పోతున్నారు. ఇక ఎన్నికలకు ముందు వైసీపీ లోకి వెళ్లి అదే ఓడించిన వసంత కృష్ణ ప్రసాద్ సైతం ఉమా అవమానాలు సహించలేకే పార్టీ వీడారు. ఇలా పార్టీ వీడిన వారే కాదు.. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు సైతం ఉమా నిరంకుశ రాజకీయాలు భరించలేక పార్టీలో ఉండాలా వెళ్లాలా ? అన్న డైలమాలో ఉన్నారు.
అయితే ఇంతలా దేవినేని మీద అసంతృప్తి పెరగడానికి కారణం ఆయన డామినేషన్. జిల్లాపై పెత్తనం చేస్తూ ఉమా సొంత నేతలనే ఇబ్బందులు పెడుతున్నారు. నాడు కొడాలి నాని, నేడు వంశీ వీళ్లంతా ఉమా బాధితులే. ఇక ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని ముందున్నారు. అలాగే బుద్దా వెంకన్న, బొండా ఉమాలకు కూడా దేవినేని అంటే పడదు. ఇక గత టీడీపీ ప్రభుత్వంలో కాగిత వెంకట్రావు లాంటి సీనియర్ నేతలకు మంత్రి పదవి రాకపోవడంలో కీలక పాత్ర ఉమాదే అని టాక్ కూడా ఉంది.
ఇక గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అంబటి బ్రాహ్మణయ్య లాంటి మృదుస్వభావే ఉమా తీరుతో వేగలేకపోయారు. ఇక మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు ఉమాకు మాటల్లేవ్. ఇక జలీల్‌ఖాన్ సైతం ఉమాపై రుసరుసలాడుతున్నారు. ఇక నూజివీడు ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సైతం తన నియోజకవర్గంలో ఉమా గ్రూపు రాజకీయాలు పెడుతున్నారని గత మూడేళ్ల నుంచే గోల గోల చేస్తున్నారు. మొత్తానికైతే జిల్లాలో ఉమా యాంటీ వర్గం చాలానే ఉంది. మరి చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఉమాను నమ్ముతుండడంతో మరికొంత మంది సైతం పార్టీ వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.