ఇంతలోనే ఎంత మార్పు.. అలయ్ బలయ్ తీసుకున్న కొద్దికాలంలోనే అనూహ్య మార్పులు.. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి నుంచి కస్సుబుస్సులాడుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.. ఇదంతా ఎ వరి గురించి అని అనుకుంటున్నారా..? ఇదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మూణ్నాళ్ల ముచ్చట. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ల మధ్య క్రమంగా దూరం పెరుగుతోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. వీరిద్దరి మధ్య ఎక్కడ చెడిందో గానీ.. ఒకరిపై మరొకరు పరోక్షంగా సెటైర్లు వేసుకునే దిశగా కదులుతున్నారు.
ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. తెలంగాణ చేపడుతున్న సాగునీటి పారుదల ప్రాజెక్టులన్నీ అక్రమమని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం కోరడం గమనార్హం. అయితే.. ఇదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాకుండా.. మరికొన్ని అంశాలను ఏపీ ప్రభుత్వం లేవనెత్తింది.
అయితే.. ఏపీలో ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించి, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రగతి భవన్‌కు ఆహ్వానించి సన్మానించడం, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునివ్వడం, ఈ క్రమంలో పలు ప్రాజెక్టులు ఉమ్మడి చేపడుతామని ప్రకటించడం తెలిసిందే. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదుగానీ.. ఇద్దరు సీఎం జగన్, కేసీఆర్ మధ్య క్రమంగా దూరం పెరుగుతోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కూడా హాట్‌టాపిక్‌గా మారాయి.
ఏపీలో ఆర్టీసీని సీఎం జగన్ ప్రభుత్వంలో విలీనం చేశారని, ఇక్కడ కూడా చేయాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేయడంతో.. జగన్‌పై సీఎం కేసీఆర్ పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎలాంటి సెటైర్లు వేశారో అందరికీ తెలిసిందే. ఇక, ఏపీ ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌తో ఇద్దరు సీఎంల మధ్య దూరం మరింత పెరగడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముందుముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి మరి.