వైసీపీ ప్రబుత్వంలో మంత్రులుగా ఉన్న వారికి సీఎం జగన్ ఇప్పటికే నిర్ణీత సమయాన్ని కేటాయించారు. వారికి రెండున్నరేళ్ల పదవీ యోగమే ఉందంటూ.. మంత్రులుగా ఎంపిక చేసిన వారికి మీటింగ్ పెట్టి మరీ చెప్పేశారు. అయితే, ఎంతలేదన్నా.. రెండున్నరేళ్ల తర్వాత కూడా కొందరు కీలక మంత్రులను మార్చే ఉద్దేశం జగన్‌కు లేదు. దీనికి వ్యక్తిగత కారణాలు సహా ఆయా మంత్రుల పెరఫార్మెన్స్‌కూడా పనిచేస్తోంది. వీరిలో బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొడాలినాని, అనిల్ కుమార్, మేకపాటి గౌతం రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత (శాఖ మారుస్తారకానీ కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది) వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక, రెండున్నరేళ్లు లేదా అంతకు ముందుగానే పదవులను వీడే పరిస్థితి కూడా కొంతమంది మంత్రుల ను వేధిస్తోంది. వీరిలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, మోపిదేవి వెంకటరమణ, వెలంపల్లి శ్రీనివాస్, పినిపే విశ్వరూప్, శ్రీరంగనాథరాజు వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరు తమ శాఖలపై ఇప్పటికీ పట్టు సాధించక పోవడం ప్రధానంగా మైనస్‌గా మారిపోయింది. అదేసమయంలో ప్రత్యర్థి పార్టీ ల నుంచి వినిపిస్తన్న విమర్శలకు వీరు పెద్దగా రియాక్ట్ కావడం లేదు.
పైగా ఆయా నియోజకవర్గాల్లోనూ వీరు పట్టు పెంచుకోలేక పోతున్నారు. కొందరు ఇంచార్జ్‌లపై నే ఇప్పటికీ ఆధారపడుతున్నారు. సీఎంగా జగన్ కీలకమైన పథకాలను ప్రకటిస్తున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లే బాధ్యతను మంత్రు లకే అప్పగించారు. అదికారులను సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వంపై ఎలాంటి మచ్చలూ పడకుండా ముందుకు సాగాలని సూచిస్తున్నారు. కానీ, పైన చెప్పుకొన్న మంత్రులు మాత్రం పదవులను అలంకార ప్రాయంగానే బావిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఒకరిద్దరు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వంటి వారు కొంత మెరుగని అనిపిస్తున్నా.. మిగిలిన వారు డమ్మీలుగానో.. లేదా మితిమీరిన సౌమ్యాన్నో ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వాధినేతకు ఇబ్బంది కలిగిస్తోంది. దీంతో వీరికి వచ్చే రెండు మాసాల్లోనే మంత్రులుగా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారని భావిస్తున్నట్టు వైసీపీలోనే చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.