అప్పు.. అనగానే చాలా మంది జడుసుకుంటారు. ఎందుకంటే తీసుకున్న మొత్తానికి కట్టాల్సిన వడ్డీని తలుచుకుని. అయినా కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ అవసరాలకు, మరే ఇతర ప్రాణాపాయ స్థితిలో ఇతరుల నుంచి రుణం తీసుకుంటారు. ఇలా తీసుకుని కట్టలేక ఎందరో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట మనం చూస్తూనే ఉన్నాం. అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్‌మనీ వ్యవహారం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. అనేక మంది మహిళలను వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దింపిన సంఘటనలు సభ్యసమాజాన్ని నివ్వెరపరిచాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా వెలుగుచూసిన ఓ సంఘటన అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. డిగ్రీ చదివే ముగ్గురు విద్యార్థినులు వ్యక్తిగత అవసరాల కోసం అప్పు చేయడం విస్మయానికి గురి చేస్తున్నది. తీసుకున్న రుణం చెల్లించలేక వారు ఆత్మహత్యకు యత్నించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం తెలిసిన ఓ వ్యక్తి నుంచి రూ. 20వేలను అప్పుగా తీసుకున్నారు. ఇటీవల కాలం నుంచి సదరు వ్యక్తి తన అప్పు తీర్చాలంటూ విద్యార్థినులపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ఆ వేధింపులను భరించలేక సదరు ముగ్గురు విద్యార్థినులు మానసికంగా సతమతమయ్యారు. ఈ క్రమంలో ఇంటి నుంచి ముగ్గురు విద్యార్థినులు అనంతపురం బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ నిద్రమాత్రలను మింగారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. దీంతో ప్రాణాపాయం తప్పిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అప్పుల ఊబిలో వీరు ముగ్గురే ఉన్నారో? మరింక ఎంతమంది ఉన్నారో?