వెన్నిరాడై నిర్మల.. పలు తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి. ఆమెకు తెలుగులో మంచి పేరే ఉన్నా.. తమిళంలో మాత్రం ఇంకా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈమెకు నలుగురు సోదరీమణులు. అయితే.. సినిమాల్లో పడి ఈమె వివాహమే చేసుకోలేనంత బిజీ అయ్యారంటే ఆశ్చర్యం వేస్తుంది. అవేకళ్లు, భక్తప్రహ్లాద, మూగనోము, కత్తుల రత్తయ్య వంటి అనేక హిట్ సినిమాలలో నిర్మల నటించారు.
venaradi
దక్షిణ భారత భాషలన్నింటా 100కు పైగా సినిమాలలో నటించారు. శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన వెన్నె రాడై సినిమాతో రంగప్రవేశం చేయడంతో ఈమె పేరు వెన్నిరాడై నిర్మలగా స్థిరపడిపోయింది. ఆసక్తికర విషయం ఏంటంటే తన మొదటి సినిమాలో తనతో పాటు తెరపై పరిచయమైన జయలలితపై 1989 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో నిర్మల అండిపట్టి నియోజకవర్గం నుండి ఏ.ఐ.ఏ.డి.ఎం.కె అభ్యర్థిగా పోటిచేశారు.
ఇక, ఎంజీఆర్‌కు అత్యంత సన్నిహితురాలిగా కూడా వెన్నిరాడై నిర్మల పేరు తెచ్చుకున్నారు. జయలలితకు పార్టీని అప్పగించడానికి ముందు.. తన వారసురాలిగా నిర్మలను ప్రకటించాలని ఎంజీఆర్ భావించారు. అయితే.. నిర్మల దానికి ఒప్పుకోలేదు. కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఆమెను ఎమ్మెల్సీగా పంపించేందుకు ఎంజీఆర్ ప్రయత్నించారు. దీనికి సంబంధించి ఆమె నామినేషన్ వేశారు కూడా. అయితే.. అప్పటికే ఐపీ పెట్టిన కేసు ఆమెపై ఉంది.
దీంతో నిబంధనల ప్రకారం నిర్మల అభ్యర్థిత్వం చెల్లుబాటు కాలేదు. దీంతో ఆగ్రహించిన ఎంజీఆర్.. ఏకంగా.. శాసన మండలిని రద్దు చేయడం గమనార్హం. ఇక, జయలలిత కన్నాముందే.. నిర్మలను తన వారసురాలిగా ప్రకటించాలని ప్రయత్నించిన ఎంజీఆర్‌కు నిర్మల గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే.. ఆమె ఆయన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. అయితే, నిర్మల స్తానాన్ని జయలలిత సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీని ముందుండి నడిపించడం విశేషం.