చిత్ర పరిశ్రమలో ఉండే ఎంత పెద్ద స్టార్ హీరో కైనా ఏదో ఒక సమయంలో కొన్ని సినిమాలకు విడుదల సమస్య వస్తుంది. అది నిర్మాత దగ్గర నుంచి రావచ్చు, లేదా ఇతర కారణాలు ఏమైనా కావచ్చు.. స్టార్ హీరోలుగా ఉన్న వారీ సినిమాకు కూడా ఒక్కొక్కసారి ఈ ఇబ్బందులు తప్పవు. అలా విడుదలకు ఇబ్బంది పడిన హీరోలలో చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు వారు నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా లేటుగా విడుదలై కూడా ఆ స్టార్ హీరోలకి తిప్పలు తెచ్చి పెట్టిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. అలా సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా అంజి. ఈ సినిమా దాదాపు 6 సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకుని ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ఆలస్యంగా విడుదలై డిజాస్టర్ అయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. బాలయ్య నటించిన మహారధి సినిమా కూడా విడుదలకు ముందు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. 2007 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఆలస్యంగా విడుదలై బాలయ్యకు భారీ నష్టాన్ని మిగిల్చింది.
మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దేవీ పుత్రుడు మూవీ పరిస్థితి కూడా ఇదే. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా విడుదలకు ఎన్నో ఇబ్బందులు పడి లేటుగా ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. అలాగే మరో సీనియర్ హీరో నాగార్జున నటించిన ఢమరుకం సినిమా కూడా రిలీజ్‌కి ముందు పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఎలాగోలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రెబల్ సినిమా పరిస్థితి కూడా ఇదే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురైంది. ఇక సినిమా విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన ఖలేజా సినిమా కూడా నిర్మాత సింగనమల రమేష్ వివాదాలలో ఇరుకోవడంతో వాయిదా పడుతూ వచ్చి ప్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా కూడా టైటిల్ తో పాటు నిర్మాత కూడా వివాదాల్లో ఇరుక్కోవడంతో సినిమా వాయిదా పడుతూ.. చివరగా ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది
ఇలా స్టార్ హీరోల సినిమాలే కాకుండా యంగ్ హీరోల సినిమాలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. గోపీచంద్ హీరోగా వచ్చిన ఆరడుగుల బుల్లెట్, శర్వానంద్ రాజాధిరాజా, నాని హీరోగా వచ్చిన జెండాపై కపిరాజు, అల్లు అర్జున్ ఆర్య 2, విజయ్ దేవరకొండ ఏం మంత్రం వేసావే, నాగ చైతన్య ఆటోనగర్ సూర్య, సాయి ధరమ్ తేజ్ రేయ్, కళ్యాణ్ రామ్ షేర్ వంటి సినిమాలు కూడా విడుదలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆలస్యంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ సినిమాలగా మిగిలిపోయాయి.