పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద బ్రేక్ అందించిన సినిమా తొలిప్రేమ. 1998లో రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. అసలు ఈ సినిమా ఇప్పుడు చూస్తున్నా కూడా ఏదో కొత్త ఫీల్ ఉంటుంది. ఈ తరం జనరేషన్‌కు కూడా ప్రేమలోని తొలి మాధుర్యాన్ని రుచి చూపిస్తోన్న సినిమా ఈ తొలిప్రేమ. పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి జంటగా ఏ .కరుణాకరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాను దర్శకుడు నడిపించిన తీరుకు నిజంగా ఇప్పటి ప్రేక్షకులు కూడా హ్యాట్సాఫ్ చెపుతుంటారు. దేవా అందించిన మ్యూజిక్ కూడా చాలా చాలా హైలెట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ నెల 30న తొలిప్రేమ రీ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ఇప్పటికే రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్లు కూడా చేస్తున్నారు.
రీ రిలీజ్ అవుతోన్న అన్ని థియేటర్లలో షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లకు రీలీజ్ అవుతోన్న వేళ ఇప్పటకి కూడా ఈ సినిమాకు టిక్కెట్లు దొరకడం లేదంటే పవన్ ఛరిష్మా ఎలా ఉందో తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు కరుణాకరన్ ఒక ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు బయట పెట్టారు. ఈ సినిమాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భార్య జయాబచ్చన్‌తో కలిసి చూశారట.
అయితే తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తున్నంత సేపు అమితాబ్ చాలా చికాకు పడ్డారట. చివరి నిమిషం వరకు కూడా హీరోయిన్ పట్ల హీరో తనకున్న భావాలను ఇంకా చెప్పకపోవడంతో … క్లైమాక్స్ చాలా టెన్షన్ గా నడుస్తూ ఉంటుంది. అప్పటకీ కూడా హీరో తన మనసులో మాట బయట పెట్టకపోవడంతో సినిమా చూస్తోన్న అమితాబ్ తన కారు తాళాలను విసిరేశారట.
క్లైమాక్స్‌లో హీరోయిన్ తిరిగి వచ్చిన తర్వాత అమితాబ్ సార్ పక్కన కూర్చున్న జయ బచ్చన్ మామ్ హ్యాపీగా ఫీల్ అయి క్లాప్ కొట్టారని.. ఈ విషయాన్ని చెన్నైలో ఇద్దరు కలిసినప్పుడు తనతో చెప్పారని కరుణాకరన్ గుర్తు చేసుకున్నారు.