రాముడిగా, కృష్ణుడిగా నభూతో అన్న రీతిలో నటించి తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచారు అన్నగారు ఎన్టీఆర్. ఆయన నటించిన అనేక సినిమాలు హిట్టయ్యాయి. అయితే.. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమై న దైవం.. శ్రీవేంకటేశ్వరస్వామి. అన్నగారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. తొలి సమాచారం తిరుమల శ్రీవారికే వెళ్తుంది. ఏదైనా సినిమా హిట్టయినా.. ఆయన తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునేవారు.
అందుకే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తిరుమలను కనీవినీ ఎరుగని రీతిలో అభవృద్ధి చేశారు. ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అన్నగారి ఆలోచనల నుంచి వచ్చిందే కావడం విశేషం. ఇక, అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామి పాత్రను తొలిసారిగా పోషించిన చిత్రం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం.
కళా దర్శకుడు ఎస్.వి.ఎస్.రామారావు పర్యవేక్షణలో వాహినీ స్టూడియోలో తిరుమల ఆలయం సెట్ వేశారు. ఇందులో శ్రీవారికి నిత్యపూజలు జరిగేవి. ఈ సెట్‌లోనే చిత్రీకరణ సాగింది. దీంతో పాటు అన్నామలై, మామండూరు, ఊటీ, మద్రాసులలో షూటింగ్ చేశారు. ఈ సినిమాకు దర్శకుడు పి. పుల్లయ్య. అయితే.. అన్నగారికి ఓ సందేహం వచ్చింది. తిరుపతి శ్రీవారి గురించి సినిమా చేస్తూ.. తిరుమలలో షూటింగ్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
అయితే.. దర్శకుడు మాత్రం ఆ అవసరం లేదని.. సెట్‌లోనే అన్నీ ఉన్నాయని చెప్పారు. కానీ..అన్నగారు మాత్రం అలా కుదరదు.. క్షేత్రప్రాధాన్యం సినిమాలో ఉండాల్సిందేనని పట్టుబట్టి తిరుపతిలోనూ షూటింగ్ జరిగేలా.. తిరుమల విశేషాలు అందరికీ తెలిసేలా చిత్రీకరణకు పట్టుబట్టారు. దీంతో దర్శకుడికి తిరుపతిలో షూటింగ్ చేయక తప్పలేదు.