మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి బంధంతో భార్యభర్తలు కావడం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. ఈ యేడాది చివర్లోనే మెగా ఇంట పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమను సాఫల్యం చేసుకునే క్రమంలో తొలి అడుగు వేశారు.
ఇక లావణ్య త్రిపాఠి ఎవరు ? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటన్నది కూడా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్. డిసెంబర్ 15, 1990న యూపీలోని ఫైజాబాద్‌లో జన్మించింది. ఆ తర్వాత ఆమె ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో పెరిగింది. ఆమె తండ్రి లాయర్ వృత్తిలో కొనసాగుతున్నారు. తల్లి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందింది.
లావణ్య అక్క అక్కడ కమిషనర్‌గా పని చేస్తున్నారు. లావణ్యకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. డెహ్రడూన్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన లావణ్య ఆ తర్వాత ముంబైకు షిఫ్ట్ అయ్యింది. ముంబైలోని రిషి దయారమ్ నేషనల్ కాలేజ్‌లో ఆర్థికశాస్త్రంలో పట్టా తీసుకుంది. ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో మోడల్‌గా కొన్ని ప్రకటనల్లో కనిపించింది.
ఆమె పాఠశాలలో చదివే రోజుల్లో 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది. లావణ్య శాస్త్రీయ నృత్యంలో కూడా నైపుణ్యం సాధించింది. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో ఆమె హీరోయిన్ అయ్యింది. స్నేహితుల సలహా మేరకు ఈ సినిమా అడిషన్స్‌కు వచ్చి హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. అంతకు ముందు ఆమె హిందీలో ప్యార్ కా బంధన్ అనే టీవీ షోతో పాపులర్ అయ్యింది. నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది.