సాధారణంగా సినిమా అంటేనే అనేక పాత్రలు తెరమీదికి వస్తాయి. చెల్లి, తల్లి నుంచి భార్య, వేశ్య పాత్రల వరకు నటించాల్సి ఉంటుంది. అయితే.. ఈ విషయంలో కొందరు ససేమిరా అనేవారు. కొందరు మాత్రం పాత్ర ఏదైనా.. తమ వంతు న్యాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు. ఈ విషయంలో అంజలీదేవికి మాత్రం పట్టింపు ఎక్కువగా ఉండేది. అదేమిటి.. నిన్న వచ్చిన సినిమాలో భార్యగా నటించి.. ఇప్పుడు చెల్లిగానా? అని ప్రశ్నించేవారట.
కానీ, సావిత్రి, జమునలు మాత్రం పాత్రల విషయంలో ఎలాంటి ప్రశ్నలు లేకుండా.. బాగుంటే చాలు సర్దుకు పోయేవారట. ముఖ్యంగా అన్నగారు ఎన్టీఆర్‌తో జమున, సావిత్రి, అంజలీదేవి అనేక సినిమాల్లో నటించారు. సూపర్ హిట్ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. అయితే.. వీరు ఆయన సరసన ప్రేమికులు, భార్యలుగానే కాదు.. కొన్ని కొన్ని సినిమాల్లో చెల్లి పాత్రలు కూడా వేయాల్సి వచ్చింది. అయితే.. అంజలీదేవి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఒకటి రెండు అవకాశాలు కోల్పోయారు.
ఇలా.. సావిత్రి, జమునలు.. అన్నగారితో భార్యలుగా, ప్రేమికులుగా నటించడమే కాకుండా.. చెల్లి పాత్రల్లోనూ నటించారు. రక్తసంబంధం సినిమాలో సావిత్రి-ఎన్టీఆర్ అన్నా చెల్లెళ్లుగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. దీనికి ముందే.. జమున కూడా ఎన్టీఆర్‌కు చెల్లిగా నటించి.. రాణించారు. అదే అప్పుచేసి పప్పుకూడు సినిమా. వాస్తవానికి ఈ సినిమాలో అంజలీదేవిని తీసుకోవాలని అనుకున్నారు.
కానీ, ఎన్టీఆర్‌తో అప్పటికే.. హీరొయిన్‌గా కొన్ని సినిమాలు చేసి ఉండడంతో చెల్లి పాత్రకు ఆమె ససేమిరా అన్నారు. అటు వైపు ఎన్టీఆర్ ఉన్నారని.. సావిత్రి, జమునకు లేని ఇబ్బంది మీకు ఎందుకని ప్రశ్నించినా ఆమె మాత్రం తాను చేయనంటే చేయనని తెగేసి చెప్పారు. దీంతో చివరకు జమునను తీసుకున్నారు. ఇది కూడా హిట్ కాంబినేషన్‌గా నిలిచింది. అయితే.. తర్వాత మళ్లీ ఈ అవకాశం రాలేదు.