దొంగ‌గా ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం కావాలా… ఆ ఊర‌మాస్ సినిమా ఇదే..!

అన్న‌గారు ఎన్టీఆర్ అనేక సినిమాల్లో న‌టించారు. క్లాస్ నుంచి మాస్ వ‌ర‌కు, పౌరాణికం నుంచి జాన‌ప‌దం వ‌ర‌కు అనేక వంద‌ల సినిమాల్లో అనేక విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఆయ‌న పోషించారు. అయితే.. ఎన్ని పాత్ర‌లు వేసినా.. ఆయ‌నలో ఉన్న‌క‌ళాకారుడు అలానే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా ఊర‌మాస్ వేషం వేసి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఔరా అనిపించిన ఏకైక సినిమా కూడా ఉంది. అదే.. 1954లో వ‌చ్చిన `రాజు-పేద‌`. ఈ సినిమాలో అన్న‌గారు ప‌క్కా మాస్‌గా న‌టించారు. పాత్ర ల‌క్ష‌ణం ప్ర‌కారం.. దొంగ పాత్ర‌లో న‌టించారు.

అయితే.. ఇదేదో ఘ‌రానా దొంగో మంచి దొంగో కాదు.. సాదాసీదా దొంగ పాత్ర. ఒంటిపై చిరిపోయిన ఒకే ఒక్క చొక్కా.. (మోకాళ్ల వ‌ర‌కు సాగినట్టుగా ఉండేది) మాత్ర‌మే ఉంటుంది. ఇక‌, ముఖంపైక‌నుబొమ‌లు తీసేసి ఉంటాయి. అంతేకాదు.. న‌ల్ల‌టి మ‌చ్చ‌లు. ఇవ‌న్నీ ఒక విధంగా ఉంటే.. ఆయ‌న మాట్లాడే భాష మ‌రింత మాస్‌. `నీ అయ్య‌, నాయాల్ది` అనే ప‌దాలు ఎక్కువ‌గా వినిపిస్తాయి. అంతేకాదు.. న‌ట‌న విష‌యానికి వ‌స్తే.. ఒక దొంగ ఎలాంటి బాధ్య‌త‌లు లేని వ్య‌క్తిగా ఎన్టీఆర్ న‌టించారు.

కుటుంబం అంతా అడుక్కుని తెచ్చుకున్న నూక‌ల‌తో గంజి కాసుకుని తాగి బ‌తికే కుటుంబం. అయితే.. ఇలా కాచుకున్న‌గంజిని కూడా పోలిగాడు(ఎన్టీఆర్‌) ఏదో ఒక‌వేళ‌కు వ‌చ్చి.. లాగేసుకుని తాగేసే తీరు.. ప‌క్కా ఊర‌మాస్‌కు అద్దం ప‌డుతుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.ఏ. సుబ్బారావు తన స్వంత నిర్మాణ సంస్థ బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రాజూ-పేద 1954, జూన్ 25న విడుదలయ్యింది. అప్ప‌ట్లో ఈ సినిమాను చూసేందుకు.. ముఖ్యంగా అన్న‌గారి ఊర‌మాస్‌ను తిల‌కించేందుకు బ‌ళ్లు క‌ట్టుకుని కూడా వ‌చ్చేవార‌ట‌.

మార్క్ ట్వేయిన్ నవలాధారిత హాలీవుడ్ చిత్రం `ది ప్రిన్స్ అండ్ పాపర్` ను అనుసరించి రూపొందించారు. తెలుగులో హిట్ అయిన ఈ సినిమాను 1957లో తమిళంలో ఆందీ పిట్రాసెల్వమ్ పేరుతో డబ్బింగ్ చేశారు. అనంత‌రం .. ఇదే చిత్రాన్ని హిందీలో రాజా అవుర్ రంక్‌గా కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఎల్.వి.ప్రసాద్ 1968లో పునర్నిర్మించారు. అయితే.. తెలుగులో హిట్ అయిన‌ట్టు ఈ సినిమా ఇత‌ర భాష‌ల్లో హిట్ కాలేక‌పోయింది.