చాలా మంది అగ్ర నటుల కంటే కూడా.. చాలా ఆలస్యంగా.. రామారావు కారు కొన్నారు. రేలంగి, రమణా రెడ్డి, మాధవపెద్ది సత్యం వంటివారు కూడా.. కార్లు కొనేశారు. నిజానికి వీరికంటే అన్నగారు ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ.. ఆయన మాత్రం కారు కొనలేదు. దీనికి ఏవో కారణాలు చెప్పేవారు. కానీ, సావిత్రి, రేలంగి మాత్రం.. ఎక్కడైనా తారసపడినప్పుడు.. అన్నగారిని ఆటపట్టించేవారు.
“ఏముంది.. మా అన్నగారికి.. స్టూడియోవాళ్లు కారు పంపిస్తారు. ఎంచక్కా గడిచిపోతున్నాయి రోజులు“ అని అనేవారు రేలంగి. “ఔనా!“అని సావిత్రి అమాయకంగా అనేవారు. దీంతో అన్నగారికి కోపం వచ్చేది. సరే.. ఎట్టకేలకు.. అన్నగారు కూడా ఒక కారు కొన్నారు. అప్పట్లో ఆ కారు ఖరీదు.. 80 వేలు. ఇప్పటికీ ఉందని అంటారు. కానీ, ఇందులో రెండే సీట్లు ఉంటాయి. డ్రైవర్, దాని పక్కన ఒకరు అంతే!
వెనుక అంతా.. కూడా.. ఏమీ ఉండదు. మొత్తం క్లోజ్. ఈ కారులోనే అన్నగారు షూటింగులకు రావడం ప్రారంభించారు. అయితే.. అప్పట్లో రేలంగి ఒక సంప్రదాయాన్ని అలవాటు చేశారు. షూటింగ్ పూర్తయ్యే వరకు ఉండి.. మిగిలిన ఆర్టిస్టులను కూడా.. తను వెళ్లే దారిలో దింపి వెళ్లేవారు. అయితే.. రామారావు డబుల్ సీటు కారు కొనడంతో రేలంగి, సావిత్రిలు సటైర్లు వేయడం ప్రారంభించారు.
“ఫోర్ సీటు కారు కొంటే మేమేమీ ఎక్కంలేండి అన్నగారు“ అని రేలంగి అనేవారట. సావిత్రి మాత్రం.. ఆయన పక్కన కూర్చునే స్థాయి ఎవరికీ లేదేమో అన్నయ్యా(రేలంగి) అని హాస్యంగా వ్యాఖ్యానించేవారట. అన్నగారు మాత్రం.. మౌనంగా ఉండి.. నాదేముందండి.. మీరు అనుకున్నంత హీరో కాదు. ఏదో ఇలా .. జరిగిపోతోంది! అని నవ్వేవారట.